ఏపీలో జగన్‌ని ఎదురుకోవడానికి చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. సింగిల్‌గా అయితే జగన్‌ని ఎదురుకునే సత్తా బాబుకు లేదు. ఆ విషయం 2019 ఎన్నికల నుంచి అర్ధమవుతూనే ఉంది. స్థానిక ఎన్నికల్లో కూడా బాబు సత్తా ఏంటో తెలుస్తోంది. అలా అని పవన్ కల్యాణ్‌కు జగన్‌ని ఎదురుకునే సత్తా అసలు లేదు. కొద్దో గొప్పో బాబుకైనా జగన్‌ని ఢీకొట్టే సత్తా ఉంది గానీ, పవన్‌కు లేదనే చెప్పొచ్చు.
కాకపోతే బాబు-పవన్‌లు కలిస్తే మాత్రం జగన్‌కు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ దిశగానే బాబు-పవన్‌లు ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. జగన్‌ని దెబ్బతీయడానికే ఇద్దరు రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే బాబు-పవన్‌లు పొత్తు పెట్టుకోవడం ఖాయమని అర్ధమవుతుంది. ఈ పొత్తు వల్ల జనసేనకు ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. టిడిపి సపోర్ట్‌తో ఆ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కానీ పొత్తు వల్ల టిడిపికి లాభం ఉంది…నష్టం కూడా ఉంది. లాభం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోకుండా ప్లస్ అవుతుంది. దాని వల్ల వైసీపీకి చెక్ పెట్టొచ్చు.
కానీ పొత్తు వల్ల కొన్ని సీట్లని టిడిపి వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన నాయకత్వం ఉంది. ఓడిపోయినా సరే ఎలాగోలా పార్టీని పైకి తీసుకోచ్చేందుకు టిడిపి నేతలు కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో పొత్తు వల్ల కొందరు తమ్ముళ్ళు సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. జనసేన కోసం సీట్లు త్యాగం చేయాలి. కానీ తమ్ముళ్ళు ఆ త్యాగానికి రెడీగా ఉన్నట్లు లేరు.
కాకపోతే బాబు చెబితే తప్పక ఒప్పుకోవాలి. ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని తమ్ముళ్ళు సీట్లు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ జిల్లాల్లోనే జనసేన ప్రభావం ఉంది. కాబట్టి ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు జనసేన తీసుకుంటుంది. అయితే ఈ జిల్లాల్లో టిడిపి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఏదో రాయలసీమ జిల్లాల్లో అయితే కాస్త లైట్ తీసుకునేవారు గానీ, ఈ జిల్లాల్లో తమ్ముళ్ళు సీట్లు త్యాగం చేయాలంటే కష్టమే. మరి చూడాలి ఈ పొత్తు వ్యవహారం ఎంతవరకు వెళుతుందో?