భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న కాశ్మీర్ సమస్య ఈనాటిది కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉంది. కాశ్మీర్ మాది అని పాకిస్థాన్ అంటుంటే.. భారత్ మాత్రం కాశ్మీర్ తమదేనని, పాక్‌కు ఏమాత్రం హక్కు లేదని చెబుతోంది. ఇక కొందరు కుహనా మేథావులు అయితే.. కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయం పెట్టి వారి సమ్మతి మేరకు వారికి ఏది ఇష్టమైతే అది చేయాలని, వారు ఏ దేశంతో కలవాలని భావిస్తే.. ఆ దేశంలోనే కాశ్మీర్‌ను కలపాలని చెబుతున్నారు. అయితే.. అసలు వీరంతా చేస్తున్న వాదనల్లో ఏది కరెక్ట్ ? కాశ్మీర్ నిజంగా మనకు చెందదా ? చరిత్ర ఏం చెబుతోంది ? తెలుసుకుందాం పదండి..!
భారత దేశానికి 1947, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది కదా. అయితే అప్పటికి దేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్లిపోయాక.. మన దేశంలో 560కి పైగా సంస్థానాలు ఉండేవట. అనేక మంది రాజులు ఆ సంస్థానాలను పాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పటి ప్రధాని నెహ్రూ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సంస్థానాల పని చూసుకోమని చెప్పారు. ఆ సంస్థాలను భారత్‌లో విలీనం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పడంతో వల్లభాయ్ పటేల్ ఆ పనిలో నిమగ్నమయ్యారు. అయితే అన్ని సంస్థానాలను ఆయన దేశంలో విలీనం చేశారు. కానీ కాశ్మీర్ సంస్థానం రాజు హరిసింగ్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే.. అప్పట్లో ఆయా సంస్థానాలకు.. తాము ఏ దేశంలోనైనా కలిసే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో అన్ని సంస్థానాలు భారత్‌లో విలీనం అయ్యాయి. కానీ కాశ్మీర్ రాజు హరిసింగ్ పాకిస్థానా, భారతా అని నిర్ణయించలేదు. దీంతో పాకిస్థాన్ అదే అదునుగా భావించి కాశ్మీర్‌పైకి తన సైనికులను గిరిజనుల రూపంలో పంపించింది.
అయితే సైనిక బలం తక్కువగా ఉన్న కాశ్మీర్ రాజు హరిసింగ్ ఆ దాడిని చూసి భారత్‌ను సాయం కోరాడు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ మాత్రం.. ఒక కండిషన్ పెట్టాడు. హరిసింగ్ పాలన పట్ల తిరుగుబాటు చేసి జైలులో ఉన్న షేక్ అబ్దుల్లా ను విడిపిస్తేనే భారత్ సహాయం చేస్తుందని నెహ్రూ హరిసింగ్‌కు చెప్పాడు. దీంతో హరిసింగ్ చేసేది లేక అందుకు ఒపుకున్నాడు. అయితే అప్పటికే రెండు రోజులు ఆలస్యం అయింది. దీంతో పాక్ సైనికులు కాశ్మీర్ భూభాగంలో చాలా వరకు ముందుకు వచ్చేశారు. అయినప్పటికీ భారత సైనికులు వారిని అక్కడే ఆపేశారు.
అలా ప్రధాని నెహ్రూ చేసిన ఆలస్యం వల్ల పాక్ సైనికులు చాలా వరకు కాశ్మీర్‌ను ఆక్రమించారు. అయితే కాశ్మీర్‌లో చొచ్చుకువచ్చిన పాక్ సైనికులను అప్పుడే వెనక్కి తరిమి ఉంటే.. కాశ్మీర్ నిజంగా మనకు దక్కేదే. కానీ.. నెహ్రూ ఉన్న చోట ఉండకుండా.. ఐక్యరాజ్యసమితి ముందు ఈ సమస్యను పరిష్కరించమని ఫిర్యాదు చేశాడు. దీంతో ఐక్యరాజ్యసమితి యుద్ధం ఆపేయమని, ఇరు వర్గాలు కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, పాక్ సైనికులు కాశ్మీర్‌లో చొచ్చుకువచ్చి ఆగిన చోటే నియంత్రణ రేఖ గీయాలని చెప్పింది. దీంతో సగం కాశ్మీర్ పాకిస్థాన్ వశమైంది.
అసలు నిజంగా చెప్పాలంటే కాశ్మీర్ భారత్‌కే చెందుతుంది. ఎందుకంటే.. పాకిస్థాన్ లేదా భారత్‌లలో ఏ దేశంలో కలవాలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని అప్పట్లో సంస్థానాల రాజులకే వదిలేశారు. ఆ అంశంలో పూర్తి నిర్ణయం సంస్థానాధీశులదే ఉంటుంది. ఈ క్రమంలో కాశ్మీర్ సంస్థానం రాజు హరిసింగ్ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నాడు. కనుక నిజానికి కాశ్మీర్ భారత్‌కే దక్కుతుంది. కానీ నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాల వల్ల కాశ్మీర్ లో సగ భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అలా ఆ సమస్య అప్పటి నుంచి అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోనే ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచే పాక్ ఉగ్రవాదులను తమ సైనికుల సహాయంతో భారత్ పైకి ఉసిగొల్పుతోంది.
ఇక కాశ్మీర్ అంటే మనకు ఆర్టికల్ 370 కూడా గుర్తుకు వస్తుంది. దీని గురించి కూడా తెలుసుకుందాం. భారత దేశానికి కాశ్మీర్‌పై రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు తప్ప ఇతర ఏ హక్కులు లేవు. అంతేకాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న పౌరులకు కూడా కాశ్మీర్ పై హక్కు లేదు. అంటే.. భారతీయులు కాశ్మీర్‌లో భూమి కొందామంటే వీలు కాదు. ఇది నెహ్రూ పుణ్యమే అని చెప్పవచ్చు. ఇది ఎలా జరిగిందంటే.. హరిసింగ్‌కు సాయం చేసిన సందర్భంలో షేక్ అబ్దుల్లాను విడిచిపెట్టారు కదా. ఈ క్రమంలో షేక్ అబ్దుల్లా నెహ్రూకు ఆర్టికల్ 370ని ప్రతిపాదించాడు. సహజంగానే షేక్ అబ్దుల్లా అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న నెహ్రూ అందుకు గుడ్డిగా ఒప్పుకున్నాడు. ఆర్టికల్ 370 ప్రకారం.. కాశ్మీర్‌కి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా తీసుకోవడానికి కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తప్పని సరి. అంటే, భారత ప్రభుత్వానికి కాశ్మీరు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఇది కూడా నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాల్లో ఒకటనే చెప్పవచ్చు. అలా భారత్‌కు కాశ్మీర్‌పై కొన్ని హక్కులు పోయాయి.
అయితే నెహ్రూ కుమార్తె అయిన ఇందిరా గాంధీకి తన తండ్రి చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. అయినా ఆమె వాటిని సద్వినియోగం చేసుకోలేదు. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోతున్న తరుణంలో భారత్ పాక్ తో యుద్ధం చేసింది. అందులో పాక్ చిత్తుగా ఓడిపోయింది. సుమారుగా 90వేల మంది పాక్ సైనికులు యుద్ధ ఖైదీలుగా భారత్‌కు చిక్కారు. అయితే అదే అదునుగా భావించి.. కాశ్మీర్ నుంచి పాక్ వెళ్లిపోతేనే వారి సైనికులను వదిలేస్తామని అప్పట్లో భారత్ గనక చెప్పి ఉంటే అప్పుడే కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యేది. ఆ రాష్ట్రం మనకు దక్కేది. కానీ అలా జరగలేదు.
యుద్ధ ఖైదీలైన పాక్ సైనికులను ఉత్తి పుణ్యానికే వదిలేశారు. పైగా పాక్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు. అదేమిటంటే.. కాశ్మీర్ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, కాల్పులు జరపకూడదని. కానీ పాక్ అప్పటి నుంచి ఏ రకంగా కూడా శాంతియుత చర్చలు జరిపేందుకు సహకరించడం లేదు. పైగా ఉగ్రవాదులతో భారత్‌పై దాడులు చేయిస్తోంది. అలా నెహ్రూ, ఇందిరాగాంధీలు చేసిన పొరపాట్ల వల్లే ఇప్పుడు కాశ్మీర్ ఇలా తయారైంది. లేదంటే.. భారత్‌కు ఎప్పుడో కాశ్మీర్ దక్కేది. ఇదీ అసలు చరిత్ర.. కానీ ఈ నిజాలు ఏవీ చాలా మంది భారతీయులకు తెలియదు. చరిత్ర సరిగ్గా తెలిసిన ఎవరైనా సరే.. కాశ్మీర్ భారత్ దే అని గట్టిగా చెబుతారు..!
(ఈ వార్త మీకు నచ్చినట్టయితే దీన్ని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. షేర్ చేసి కాశ్మీర్ సమస్య గురించి మీ ఫ్రెండ్స్ కు తెలిసేలా చేయండి. మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.)