మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గత ఏడాది కాలంగా రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ.. రైతులు నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రకటన అనంతరం కూడా రైతులు తమ ఆందోళనలను కొనసాగించేందుకు నిర్ణయించారు. పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలు రద్దు చేయడంతో పాటు.. తమ మిగతా డిమాండ్లను పరిష్కరించే దాకా ఆందోళనలు చేస్తూనే ఉంటామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. దీని కోసం కార్యాచరణ రూపొందించే పనిలో రైతు సంఘాలు ఉన్నాయి. రైతు సంఘాలు రైతు చట్టాలతో పాటు.. నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, ఎంఎస్ పీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 27న రైతు సంఘాలన్నీ సమావేశమవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. మోదీకి బహిరంగ లేఖ కూడా రాయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అయితే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు కేంద్ర మంత్రి మండలి ఈనెల 24న సమావేశం అవుతోంది. ఈనెల 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ సమావేశాల్లో రైతు చట్టాలను ఉపసంహరించుకుంటూ బిల్లు పెట్టనున్నారు.