ఓమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. వేగంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. దీంతో ఇండియా కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. ఎయిర్ పోర్ట్ ల్లో కరోనా రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని రాష్ట్రాలకు గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది.
తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఆమ్స్టర్డామ్, లండన్ నుంచి మొత్తంగా నాలుగు విమానాల్లో 1,013 మంది ప్రయాణికులు దిల్లీకి చేరుకోగా.. వారిలో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని స్పష్టం చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నెదర్లాండ్స్, యూకే నుంచి వచ్చిన నలుగురిలో ఓమిక్రాన్ ఆనవాళ్లు ఉండటంతో అధికారులు వారి శాంపిళ్లను జినోమ్ సిక్వేన్సింగ్ కు పంపించారు. ఈ నలుగురిని దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేర్పించారు. మిగతా రోగులతో కలవకుండా ఉండేలా వారి కోసం ప్రత్యేకంగా ఓ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన నలుగురు భారతీయులేనని అధికారులు తెలిపారు.
యూకే, నెదర్లాండ్స్ తో కలిపి యూరప్ మొత్తం దేశాలతో పాటు ఓమిక్రాన్ కేసులు బయటపడుతున్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లో ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని కేంద్రం నిర్ణయించింది.