ఓ వైపు రాష్ట్రంలో దగ్గర పడుతున్న అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపిక హడావిడి.. మరొక వైపు ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో, రామోనన్న ఆవేదన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై పోరాడలేక చేతులెత్తేశామన్న నిరాశ, నిస్పృహ.. ఇన్ని సమస్యల నడుమ ఏపీ సీఎం చంద్రబాబుకు మరొక కొత్త కష్టం వచ్చి పడింది. అదే.. లక్ష్మీస్ ఎన్‌టీఆర్.. ఈ సినిమాలో తనను టార్గెట్‌గా చేసుకుని సన్నివేశాలను తీశారని తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమాపై ఏవిధంగా ముందుకు వెళ్లాలో తెలియక బాబు సతమతం అవుతున్నారని తెలిసింది. అందుకే లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాపై టీడీపీ శ్రేణులు చట్ట పరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిసింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్‌టీఆర్ విడుదలకు ముందే సంచనాలను సృష్టిస్తోంది. మొదట్నుంచీ ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ లభిస్తోంది. అందుకు కారణం.. ఆ సినిమాలో ప్రేక్షకులకు తెలియని.. ఎన్‌టీఆర్ జీవితంలోని కొన్ని ఘటనలను చూపిస్తున్నారని చెబుతుండడమే. దీంతోనే ఆ సినిమా పట్ల అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే టీడీపీ శ్రేణులకు, నందమూరి అభిమానులకు మాత్రం ఈ సినిమా మింగుడు పడడం లేదు. దీంతో వారు ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
అసలే రానున్నది ఎన్నికల సమయం. ఆ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ గనక విడుదలైతే అందులో చంద్రబాబుకు నెగిటివ్ గా ఉండే అంశాలు రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఆ సినిమా ఎట్టి పరిస్థితిలోనూ విడుదల కాకుండా చూడాలని బాబు ఆలోచిస్తున్నారని.. అందుకే బాబు ఆదేశాలకు అనుగుణంగానే టీడీపీ శ్రేణులు ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకునేందుకు చట్ట పరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆ చిత్ర యూనిట్ కు టీడీపీ వర్గాలు లీగల్ నోటీసులు ఇవ్వవచ్చని కూడా తెలిసింది. మరి ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటి విడుదలవుతుందో, లేదో మరికొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది..!