సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని శోఖసంద్రంలో ముంచింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు మరో 12 మంది చనిపోవడం భారత దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఏ మట్టి కోసం పరితపించాడో.. అదే మట్టిలో మరణించాడు బిపిన్ రావత్. ఈరోజు తమిళనాడు నుంచి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పార్ఠీవ శరీరాలు ఢిల్లీకి చేరనున్నాయి. ప్రత్యేక విమానంలో వీటిని తరలించనున్నారు.
తాజాగా అమిత్ షాతో నేడు జరగాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే భేటీ రద్దైంది. బిపిన్ రావత్ మరణం కారణంగా ఈ సమావేశం రద్దు జరిగింది. తెలంగాణలో బీజేపీ విస్తరణ, రానున్న ఎన్నికల కోసం ప్రణాళికపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తెలంగాణలో అధికార పక్షం టీఆర్ఎస్ కు ధీటుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమిత్ షాతో ఈ సమావేశం ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బిపిన్ రావత్ మరణంతో అమిత్ షాతో భేటీ రద్దు అయింది. మరోవైపు సోనియా గాంధీ కూడా తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. ఖతార్ లో పర్యటిస్తున్న ఆర్మీ వైస్ ఛీప్ లెప్టినెంట్ జనరల్ ఛండీ ప్రసాద్ మహంతీ కూడా తన పర్యటనను ఉన్నపళంగా ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు.