సాధారణంగా సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్‌కు పరిమిత అవుతారని లేదా ప్రగతి భవన్లో ఉంటారని… జనంలోకి వచ్చి వారి కష్టాలని తెలుసుకోరు అని ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాయి. అయితే విమర్శలకు తగ్గట్టుగానే కేసీఆర్… పెద్దగా జనంలోకి వచ్చిన సందర్భాలు తక్కువ. అధికారంలోకి వచ్చాక ఆయన ప్రజల్లో తిరగడం తగ్గించారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఆయన బయటకొస్తూ ఉంటారు.
కానీ ఇటీవల సమయంలో ఆయన ఎన్నికలు లేకపోయినా బయటకు రావాల్సిన పరిస్తితి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో తమకు గెలుపు అంత ఈజీగా దొరకదని బాగా అర్ధమైపోతుంది. గత ఎన్నికల ముందు అంటే పార్టీ చాలా బలంగా ఉంది. పైగా ప్రతిపక్ష పార్టీలు వీక్‌గా ఉన్నాయి. దీంతో కేసీఆర్ గెలవడానికి పెద్దగా చెమటోడ్చాల్సిన అవసరం రాలేదు. ఈజీగా రెండోసారి గెలిచేసి అధికారంలోకి వచ్చేశారు.
అయితే ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ గతం మాదిరిగా ఈ సారి ఈజీగా గెలవడం కష్టం. అందుకే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే కేసీఆర్ జనంలోకి ఎంట్రీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ని వీడి హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడ్డారో… అప్పటినుంచే కేసీఆర్ బయటకు రావడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి ఆయన కంటిన్యూగా జనంలో ఏదొక కార్యక్రమం పేరుతో తిరుగుతూనే ఉన్నారు. హుజూరాబాద్‌లో ఓడిపోయాక మరింతగా జనంలోకి రావడం మొదలుపెట్టారు. అలాగే బీజేపీ టార్గెట్‌గా రాజకీయ విమర్శలు కూడా స్టార్ట్ చేశారు.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఆయన జిల్లాల్లో ప్రజల మధ్యలోకి రానున్నారు. ఈ క్రమంలోనే వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, జనగాం జిల్లాల్లో అతి త్వరలోనే పర్యటించి భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అంటే ఎన్నికల వరకు కేసీఆర్ జనంలోనే ఉండనున్నారని తెలుస్తోంది.