తాను కథానాయకుడు సినిమా చూశానని సినిమా బాగానే ఉంది కానీ ఎందుకు ఆడలేదో అర్థం కాలేదని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు అన్నారు. అయితే మహానాయకుడు సినిమాలో చూపించిన పలు సన్నివేశాలు అబద్దమని ఆయన అన్నారు.
ఎన్‌టీఆర్ బయోపిక్ నేపథ్యంలో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎంత భారీ ఫ్లాపులుగా మిగిలాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై పలువురు ప్రముఖులు సంచలన కామెంట్స్ చేశారు. సినిమాలలో అన్నీ అబద్ధాలనే చూపించారంటూ ఇప్పటికే నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. ఆ తరువాత లక్ష్మీ పార్వతి, రాం గోపాల్ వర్మ కూడా మాట్లాడుతూ.. సినిమాల్లో అబద్దాలు చూపించారని, భజన చేస్తే బయోపిక్ సినిమాలు ఆడవని కామెంట్లు చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు కూడా మహానాయకుడు సినిమాపై విమర్శనాస్త్రాలు సంధించారు.
తాను కథానాయకుడు సినిమా చూశానని సినిమా బాగానే ఉంది కానీ ఎందుకు ఆడలేదో అర్థం కాలేదని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు అన్నారు. అయితే మహానాయకుడు సినిమాలో చూపించిన పలు సన్నివేశాలు అబద్దమని ఆయన అన్నారు. ఆ సినిమాలో క్లైమాక్స్ ముందు రైలులో ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్తుంటే.. ఎవరో వచ్చినట్లు.. వారిని అడ్డుకుంటున్నట్లు చూపించారని.. వారిని లాక్కెళ్లడానికి యత్నించినట్లు చూపించారని.. అప్పుడు చంద్రబాబు అడ్డు పడ్డట్లు చూపించారని.. కానీ అవన్నీ జరగలేదని.. ఎందుకంటే ఆ సమయంలో తాను అదే రైలులో ఉన్నానని వెంకటేశ్వర్ రావు అన్నారు.
రామకృష్ణ స్టూడియోకు వచ్చిన ఎమ్మెల్యేలంతా తమకు తాముగా వచ్చారని, కానీ వాళ్లను తీసుకెళ్లడానికి ఎవరూ ప్రయత్నించలేదని.. అయితే సినిమాలో మాత్రం వాళ్లను ఎవరో వెంటాడుతున్నట్లు చూపించారని.. అది అబద్దమని దగ్గుబాటి అన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేలు బయటకు వెళ్లేవారని, సినిమాలు చూసేవారని ఆయన అన్నారు. అయితే సినిమాలో మాత్రం వారిని బంధించినట్లు చూపారని, అది అబద్ధమని అన్నారు. ఈ క్రమంలోనే మహానాయకుడు సినిమాలో చంద్రబాబును హీరోగా చూపించడానికి ప్రతి సన్నివేశంలో లేని డ్రామాను పండించారని దగ్గుబాటి అన్నారు. ఆ సినిమాలో ఉన్న పలు సీన్లు నిజం కావని అన్నారు.