మాట్లాడితే చాలు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న ఆలోచన ఒకటి బాలయ్య చేస్తున్నారు.ఈ పాటి మాటలు జగన్ సీఎం అయిన వెంటనే చెప్పి ఉంటే, ఆయనకో ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవే కావని ఇండస్ట్రీలో ఓ వర్గం అంటోంది.ఎక్కడో ఉంటూ ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడం సబబు కాదని, అసలు తెలుగు చిత్ర సీమకు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అన్నది ఉందా అన్న విషయం గుర్తుందా అని కూడా ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్న తరుణాన వివాదం ఇప్పట్లో ముగిసిపోయేలా లేదు.ఆర్జీవీ లాంటి వారు మాట్లాడి వెళ్లినా అదేమీ ఫలితం ఇచ్చేలా లేదు అనే తేలిపోయింది.తాజాగా సీన్ లోకి
బాలయ్య ఎంటరై, నాలుగు మాటలు చెప్పారు. ఈ నేపథ్యంలో సమరమా ? సామరస్యమా?
ఆంధ్రావనిలో టికెట్ల విషయమై రేగుతున్న వివాదంలో బాలయ్య ఇరుక్కున్నారు. ఎట్టకేలకు బాలయ్య కూడా మాట్లాడడంతో వైసీపీ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి.అఖండ సినిమా విజయంలో కలెక్షన్ల వసూళ్లలో చేయాల్సినంత సాయం చేసినా కూడా బాలయ్య ఎందుకని తమపై ఫైర్ అవుతున్నారని వీరంతా మండి పడుతున్నారు. ఇదే సమయంలో టిక్కెట్ల విషయమై ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని, అందరం కలిసి సమస్యపై పోరాటం చేయాలని కోరారు. అఖండ కు సంబంధించి ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్ లో బాలయ్య తాజా వ్యాఖ్యలు చేశారు.
ఇక ఎవరెన్ని చెప్పినా వినని,వినిపించుకోని స్థితిలో ఉన్న ఏపీ సర్కారును బాలయ్య మాటలు ఆలోచింపజేస్తాయా.. ఆయన సంప్రతింపులు పోనీ ఫలిస్తాయా అంటే అదీ చెప్పలేం. తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమకు సహకారం అందించాలని బాలయ్య కోరిన కోరికను ఇరు రాష్ట్రాల పెద్దలు అంగీకరిస్తారా? ఒకప్పుడు ఉన్నంత స్పీడులో ఇవాళ బాలయ్య లేరు. రాజకీయంగా కూడా పెద్దగా ఫాంలో లేరు. హిందూపురం ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ కూడా సుడిగాలి పర్యటనలు చేశాక అటుపై కావాల్సినంత స్థాయిలో విశ్రాంతి తీసుకుంటున్నారన్న విమర్శ కూడా ఉంది. సినిమాలపై ఉన్న దృష్టి హిందూపురంపై లేదని కూడా విమర్శలు రేగుతున్న సమయంలో బాలయ్య చెప్పిన విధంగా అంతా కలిసి సమస్య పరిష్కారంపై మాట్లాడతారని అనుకోలేం.