జనసేన కార్యకర్తలపై మరియు ఇతర అభిమానులపై పవన్ సీరియస్ అయ్యారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండేవారంతా సభ్యతతో నడుచుకుని తీరాలని,అసభ్యకర రీతిలో మాట్లాడి తనకూ,పార్టీకీ తలవొంపులు తీసుకురావద్దని కోరుతూ పవన్ పదే పదే పలు జాగ్రత్తలు చెప్పారు తన కార్యకర్తలకు! ముఖ్యంగా భాషను వాడే విషయమై ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని, తీరు మార్చుకుని ఇతర పార్టీలపై వారి విధానాలపై మాట్లాడాలని, అనుచిత వ్యాఖ్యలు చేసి సాధించేదేమీ ఉండదన్న విషయం గ్రహించాలని పవన్ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు చెబుతున్నా కొందరు మాత్రం అభిమానం అనే ముసుగులో హద్దులు దాటేస్తున్నారు.వీరిపై జాగ్రత్తగా ఉండాలని, అభిమానం వేరు ఇతరులను అదే నెపంతో నొప్పించడం వేరు అని మరో మారు తన కార్యకర్తలకు క్లాస్ ఇచ్చారు.భాష, నడవడి,సమాజంలో ఇతరుల విషయమై ప్రవర్తించే తీరు అన్నవి ప్రధానంగా చేసుకునే ఓ పార్టీ నడవడి,ఉన్నతి అన్నవి ఆధారపడి ఉంటాయన్నది పవన్ చెప్పే మాట.
అభిమానం వేరు,విద్వేషం వేరు.విద్వేషంను అభిమానం అని తాను భావించనని ఎప్పుడూ అంటారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. తాను ఎన్నడూ అలాంటి వారిని ప్రోత్సహించేదే లేదని కూడా అంటారాయన.తాజాగా ఏపీ సీఎం ను ఉద్దేశించి ఓ వ్యక్తి జనసేన మద్దతు దారుడిని అని పేర్కొంటూ,తాను మానవబాంబుగా మారి సీఎంను చంపేస్తానని చెప్పడం సహేతుకం కాదని ఇదెంత మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదని పవన్ ఖండించారు.అదేవిధంగా ఇటువంటి వ్యక్తుల విషయమై అప్రమత్తంగా ఉండకపోతే నష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు.సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఓ వ్యక్తి చేసిన పోస్టుకూ,జనసేనకూ ఎటువంటి సంబంధం లేదని పవన్ స్పష్టం చేశారు.
వ్యక్తులను హింసకు గురిచేసేలా, హింసను పెంపొందింపజేసి సమాజానికి చేటు చేసేలా ఉండడాన్ని తాను వ్యతిరేకిస్తానని కూడా తెలిపారు.ఇదే సందర్భంలో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే శ్రేణులకు పవన్ పలు సూచనలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు రాసేవారిని జనసేన ఎన్నడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. పార్టీ సానుభూతిపరులమని చెప్పుకుని తిరిగే వ్యక్తుల విషయంలోనూ, అదేవిధంగా అభిమానం అనే ముసుగులో తిరిగే వ్యక్తుల అరాచక ప్రవర్తన విషయంలో కానీ జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు.కాగా ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజమండ్రికి చెందిన యువకుడ్ని పోలీసులు పట్టుకున్నారు.ఆయనను అరెస్టు చేసి మీడియా ముందుకు తీసుకువచ్చారు సైబర్ క్రైమ్ పోలీసులు.