రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వైసీపీలో జోష్ పెరిగింది. ప్రజలు ఎన్నాళ్లుగానో.. ఎదురు చూస్తున్న జిల్లాల ఏర్పాటుతో ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ముఖ చిత్రం ఒకవిధంగా ఉంటే.. ఇక నుంచి రాష్ట్ర ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. కొత్త ఏర్పాటు చేయనున్న జిల్లాలతో ఇప్పటి వరకు వెనుకబడిన ప్రాంతాలు గా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలు భారీగా పుంజుకుంటాయి. దీంతో ప్రజల ఆదాయం కూడా రెట్టింపు కానుంది.
అదేసమయంలో పాలన కూడా ప్రజలకు మరింత చేరువ కానుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరగనుంది. ఈ పరిణామాలతో రాష్ట్రం ముఖచిత్రం అనూహ్యంగా మారుతుందనే అంచనాలు వస్తున్నాయి. ప్రజలు ఆకాంక్షించిన విధంగా.. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే.. అది తమకు లబ్ధి చేకూరుస్తుందని.. వైసీపీ నాయ కులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతల మధ్య జోష్ పెరిగింది. అదేసమయంలో వారి దృష్టి ఓటు బ్యాంకుపై కూడా మళ్లింది.
ఇప్పటి వరకు ఉన్న ఓటు బ్యాంకు పెరుగుతుందా? అనే కోణంలో నాయకులు చర్చ చేస్తున్నారు. నిజానికి కొన్ని జిల్లాల్లో టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ దూకుడు ఎక్కువ. అయితే.. ఆయా జిల్లాల్లో చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు జిల్లాల ఏర్పాటుతో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో టీడీపీ అనుకూల జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ ప్రభావం పెరుగుతుందనే అంచనాలు నేతల మద్య కనిపిస్తున్నాయి.
అయితే.. జిల్లాలు ఏర్పడినప్పటికీ.. నేతల పనితీరు మారాలనే సూచనలు కూడా వస్తున్నాయి. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల్లో స్పందన బాగానే ఉన్నప్పటికీ.. నేతలు వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం ప్రజల్లో కొన్ని చోట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలు ఏర్పడినప్పటికీ.. నేతలు కూడా తమ విధానాలు.. పద్ధతులు మార్చుకోవాలనేది విశ్లేషకుల సూచన. మరి ఏం చేస్తారో చూడాలి.