తెలంగాణలో కారు, కమలం పార్టీల మధ్య వార్ నడుస్తూనే ఉంది.. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు.. చేతల యుద్ధం కూడా జరుగుతుంది. తిట్టుకోవడమే కాకుండా, కొట్టుకోవడం వరకు వెళ్ళిపోయారు. కాకపోతే గొడవలకు టీఆర్ఎస్ పార్టీనే ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా బీజేపీ నేతలు, టీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఏ మాత్రం టీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారు. పైగా ఉపఎన్నికల్లో ఓడించడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
అందుకే టీఆర్ఎస్ శ్రేణులు అదుపు తప్పేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కాదు కాదు అదుపు తప్పేలా టీఆర్ఎస్ నేతలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో దూకుడుగా ఉన్న అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఏ విధంగా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆయన దుకుదూకు కళ్ళెం వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య నల్గొండ పర్యటనకు వెళ్ళిన బండి, బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. అదేమంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు కేంద్రంపై కోపంగా ఉన్నారని చెప్పి కారు పార్టీ కథలు చెప్పింది. ఇక ఇటీవల ఉద్యోగుల కోసం దీక్షకు దిగిన బండిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక బండితో పాటు తమని ఇబ్బంది పెడుతున్న ఎంపీ అరవింద్‌ని సైతం టీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేశాయి. తాజాగా ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులని ప్రారంభించడానికి వెళ్ళిన అరవింద్, బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ళ దాడి చేశాయి. అదేమంటే పసుపు బోర్డు కోసం రైతులు చేశారని కథనాలు వేస్తున్నారు.
అయితే ఇదంతా ఒక పథకం ప్రకారమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. రైతుల ముసుగులో బీజేపీని దెబ్బకొట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..నెక్స్ట్ ఎన్నికల్లో అరవింద్, ఆర్మూర్ నుంచి బరిలో దిగుతారని ప్రచారం వస్తుంది. అందుకే ఇప్పుడు అక్కడే అరవింద్‌ని తిప్పికొట్టాలనే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. మరి టీఆర్ఎస్ వ్యూహాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.