ఈ స్వచ్ఛంద సంస్థ యాచకుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.. వారిని వ్యాపారులుగా మార్చేస్తుంది..!

-

యాచకులు కనపడితే..మనకు తోచినంత సాయం చేస్తాం..కానీ ఆ సంస్థ వారికి దానం చేయకండి అంటోంది. అది వారి మంచికే..దానం చేయకండి..వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’ అంటోంది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ‘కామన్‌మ్యాన్‌ ట్రస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెబుతోంది. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తారు అనుకుంటున్నారేమో..ఈ సంస్థ చెప్పడమే కాదు..చేసి చూపిస్తుంది. యాచకులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని వ్యాపారులుగా మారుస్తోంది కూడా. ఓ నివేదిక ప్రకారం భారతీయులు ఏటా రూ.34వేల కోట్లు యాచకులకు దానంగా ఇస్తున్నారట.

యాచకులను ప్రయోజకులుగా మార్చడమే లక్ష్యంగా గతేడాది ‘బెగ్గర్‌ కార్పొరేషన్‌’ పేరుతో ‘కామన్‌మ్యాన్‌ ట్రస్ట్‌’ను నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త చంద్ర మిశ్ర స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా వారణాసిలోని 12 యాచక కుటుంబాల నుంచి 55 మందిని ఎంచుకొని వారికి వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించారు. వారిలో కొందరు వస్త్రం, కాగితాలతో బ్యాగులు తయారు చేయడం కూడా నేర్చుకున్నారు. దీంతో వారిని స్వయం సహాయక బృందంగా మార్చి బ్యాగుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయించారు. వారి ఉత్పత్తులు మార్కెట్లో బాగానే సేల్‌ అవడంతో..మిశ్రకు తన ఆలోచనపై ఇంకా నమ్మకం పెరిగింది. దీంతో యాచకులందరినీ ఇదే బాటలో నడిపించాలని దృఢంగా సంకల్పించారు. దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని భావించి దానం చేసేవారు..అలా కాకుండా వారిపై పెట్టుబడి పెడితే యాచకుల జీవితాలే మారుతాయని మిశ్రా అంటున్నారు.

ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘బెగ్గర్‌ కార్పొరేషన్‌’కు ఆదరణ లభిస్తుండటంతో దానిని ఆదాయ వనరున్న కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో రూ. 2.5కోట్ల పెట్టుబడులు సేకరించేందుకు మిశ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం తమకు అనుమతిస్తే.. యాచకులను గుర్తించి.. పిల్లల్ని, వృద్ధుల్ని పునరావాస కేంద్రాలకు పంపించి, 18-45ఏళ్ల వయసున్న వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చి, రుణాలు ఇప్పించి వ్యాపారం ప్రారంభించేలా చేస్తామని ‘కామన్‌మ్యాన్‌ ట్రస్ట్‌’ నిర్వహకులు అంటున్నారు.

అంతేకాదు, యాచకుల పిల్లలు చదువుకునేందుకు వారణాసిలోనే ‘స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 32 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. నిజంగా మిశ్రా ఆలోచన చాలా గొప్పది..ఇది అన్ని రాష్ట్రాల్లో పాటిస్తే..రోడ్డుపక్కన, బ్రిడ్జిల కింద ఎండకి, చలికి బతికే ఎంతోమంది యాచకుల జీవితాలు మారతాయి. మీరేమంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news