తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.. సొంత నేతల మధ్య వివాదం తరచూ తలెత్తుతూనే వుంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ వివాదాలు మరింత తారస్థాయికి చేరాయి. మొన్నటి వరకు వీహెచ్, నిన్న జగ్గారెడ్డి నేడు కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డి పేరును చెప్పకుండా ఆయన, అలాగే కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాల వల్లనే మేము పార్టీ కి దూరంగా ఉంటున్నానని.. తెలంగాణ కోసం కొట్లాడి వాళ్లకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టిడిపి నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభమని నిలదీశారు. తెలంగాణ కోసం కొట్లాడి న వాళ్ళు ఎవరు…అనేది తెలియకపోతే ఎలా..? అంతర్గతంగా ఎవరితో విభేదాలు లేవని చెప్పారు.
రేవంత్ తో వ్యక్తిగత విభేదాలు కూడా లేవని.. కెపాసిటీ ఉన్నొల్లకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కొట్లాడి న వాళ్లకు ప్రయారిటీ ఇవ్వాలని.. అలా చేయకపోతే పాత కాంగ్రెస్ నాయకులు దూరం అవుతారని హెచ్చరించారు. మా లాంటి వాళ్లకు గుర్తింపు ఇవ్వలేదని.. కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న వాళ్లకు అవకాశాలు ఇస్తే బాగుంటుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.