మన దేశంలో 5 వెరైటీ రైల్వేస్టేషన్లు..పేర్లు లేవు, వెళ్లాలంటే వీసా కావాలి..!

-

రైల్వేస్టేషన్లకు వెళ్లాలంటే ఫ్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలుగా. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే రైల్వే స్టేషన్ కు వెళ్లాలంటే వీసా ఉండాలంట. ఏ రైల్వే స్టేషన్ కు అయినా..పేరు ఉంటుంది. ఇంకా ఆ పేరుతోనే ఆ ఏరియాఅంతా పాపులర్ అవుతుంది. కానీ అసలు పేరే లేని రైల్వేస్టేషన్ ఉంటే. ఇలాంటి వెరైటీ రైల్వేస్టేషన్లు గురించి ఈరోజు చూద్దాం. ఇవి ఎక్కడో ఉన్నాయి అనుకుంటారేమో..మన దేశంలోనే ఉన్నాయండోయ్.

ఇంజిన్‌ ఒక రాష్ట్రంలో.. బోగీ మరోక రాష్ట్రంలో..

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భవానీ మండి రైల్వే స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్టేషన్‌కు రైలు వచ్చి ఆగితే ఇంజిన్ ఒక రాష్ట్రంలోనూ….. రైలు బోగీలు మరొక రాష్ట్రంలో ఉంటాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. టికెట్‌ తీసుకునే ప్రయాణికులు మధ్యప్రదేశ్‌లో నిలబడితే.. టికెట్‌ ఆఫీసు మాత్రం రాజస్థాన్‌లో ఉంటుంది. భలే క్రేజీగా ఉంది కదూ. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ రైల్వేస్టేషన్‌ గురించి 2018లో ‘భవానీ మండి టేసన్ అనే బాలీవుడ్‌ సినిమానూ నిర్మించారు. చూడకపోతే ఓసారి చూసేయండి.

వీసా ఉంటేనే ఎంట్రీ

విదేశాలకు వెళ్లే వారికి వీసా తప్పనిసరిగా ఉండాలి. కానీ, పంజాబ్‌లోని అట్టరీ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాలి. ఎందుకంటే.. ఇది భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. భద్రత ప్రమాణాల దృష్ట్యా ఈ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే వారు వీసా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా లేకుండా ఎవరైనా పట్టుబడితే కఠినమైన శిక్ష విధిస్తారట.

రెండు రాష్ట్రాల్లో రైల్వే బెంచీ..

మహారాష్ట్ర, గుజరాత్‌ సరిహద్దుల్లో ఉన్న నవపూర్‌ రైల్వేస్టేషన్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడ స్టేషన్‌లోని బెంచీ మధ్యలోంచి మహారాష్ట్ర, గుజరాత్‌ సరిహద్దు రేఖ వెళ్లింది. దీంతో బెంచీలో సగం మహారాష్ట్రలో ఉంటే మరో సగం గుజరాత్‌లో ఉంటుందట. బెంచీ మీద రెండు రాష్ట్రాల పేర్లుంటాయి. ఈ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ మహారాష్ట్ర కిందికి వస్తే.. వెయిటింగ్‌ రూమ్‌, స్టేషన్‌ మాస్టర్‌ ఆఫీసులు గుజరాత్‌ పరిధిలోకి వస్తాయట. అనౌన్స్‌మెంట్స్‌ కూడా నాలుగు (హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, గుజరాతీ) భాషల్లో ఇస్తారు.

పేర్లు లేని రైల్వే స్టేషన్లు..

 

ఝార్ఖండ్‌లో పేరు లేని రైల్వేస్టేషన్‌ ఉంది. 2011లో మొదటిసారి ఇక్కడ రైళ్లు నడవడం ప్రారంభించాయి. తొలుత ఈ స్టేషన్‌ను బక్రీచంపి అని పిలిచినా.. స్థానికులు ఆందోళనలు చేయడంతో పేరును తొలగించారు. ప్రస్తుతం పేరు లేకుండానే ఈ రైల్వే స్టేషన్‌ కార్యకలాపాలను సాగించేస్తుంది.

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా-మసగ్రం మధ్యన ఓ పేరు లేని రైల్వే స్టేషన్‌ ఉంది. మొదటగా ఈ రైల్వే స్టేషన్‌ను రైనగర్‌ అని పిలిచేవారు. కానీ, పక్కనే ఉన్న రైనా గ్రామస్థులు తమ గ్రామం పేరిట మార్చాలని గొడవ చేశారు. దీని కారణంగా రెండు గ్రామాల మధ్య గొడవలు చెలరేగడంతో రైల్వే బోర్డు జోక్యం చేసుకుని ఉన్న పేరును తొలగించేసింది..దీంతో అప్పటి నుంచి ఈ స్టేషన్ పేరు లేకుండానే నడుస్తోంది. అయితే, టికెట్లు మాత్రం రైనగర్ అనే పేరుతో ఇస్తున్నారు.

భలే వింతగా ఉన్నాయి కదా. సాధారణంగా చాలామంది ఒకే టైంలో రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండాలని అనుకుంటుంటారు. అలాంటి వారికి ఇలాంటి క్రేజీ స్టేషన్లు గురించి చెప్పేయండి.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news