యెల్లో వారియర్ : టీడీపీ ఛాన్సెస్ 40 మరియు 40  

-

ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ..తెలుగుదేశం పార్టీది. ఆ క్ర‌మంలో నిన్న‌టి వేళ ఆవిర్భావ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించి కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహం నింపే ప్ర‌యత్నం చేశారు చంద్ర‌బాబు. ముఖ్యంగా క‌ష్ట‌కాలంలో ఉన్న పార్టీకి దిశా నిర్దేశం చేశారు. తాను అధికారంలో ఉండ‌గా ఎన్నో తెచ్చాన‌ని కానీ ఇప్పుడేం జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నిస్తూ..జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై మండిప‌డ్డారు. సంప‌ద సృష్టికి తానెంతో కృషి చేశాన‌ని కానీ ఇవాళ ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలే జ‌ర‌గ‌డం లేద‌ని అంటున్నారాయ‌న. రాజ‌కీయాల్లో యువ‌త రావాల‌ని పిలుపు ఇస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ల‌భై శాతం మంది యువ‌త‌కు అధికారం ద‌క్కేలా చేస్తామ‌ని, అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు అంటున్నారు.

వాస్త‌వానికి టీడీపీ కానీ జ‌న‌సేన కానీ ఇవాళ కొత్త ముఖాల వెతుకులాట‌లోనే ఉన్నాయి. ఒక‌ప్ప‌టిలా వ్యాపారాలు చేస్తూ రాజ‌కీయాల వైపు మొగ్గు చూపేవారు త‌గ్గిపోయారు. క‌క్షా పూరిత రాజ‌కీయాలు పెరిగిపోవ‌డం, గ్రామాల్లో త‌గాదాలన్న‌వి పెరిగిపోవ‌డంతో ఇటుగా వ‌చ్చేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. స‌భ్య‌త్వ న‌మోదు బాగున్నా కూడా గ్రామాల్లో వాటి పేరిట కూడా చాలా వివాదాలు నెల‌కొంటున్నాయి.ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు కొత్త ముఖాల వెతుకులాట‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్ప‌డం బాగుంది కానీ వారికి ఆఖరిదాకా తోడుంటారా అన్న‌దే డౌట్. గ‌తంలో కొంద‌రు యువ‌కుల‌ను చంద్ర‌బాబు ప్రోత్స‌హించిన మాట వాస్త‌వ‌మే! పార్వ‌తీపురం కేంద్రంగా ప‌నిచేసే వైద్యులు డీవీజీ శంక‌ర‌రావు ను ఆ రోజు ఎంపీ చేసింది ఆయ‌నే! అదేవిధంగా కాల్వ శ్రీ‌నివాసుల‌ను ఎమ్మెల్యే చేసి మంత్రి ప‌ద‌వి ఇచ్చింది కూడా ఆయ‌నే ! ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు చాలానే ఉన్నాయి కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఇందుకు అనుగుణంగా లేవు. కులం క‌న్నా డ‌బ్బు ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా ఉంది. పార్టీలు కొత్త‌వారిని ప్రోత్స‌హిస్తాం అని చెప్పినంత సులువు కాదు. అందుకు త‌గ్గ ఆర్థిక మ‌ద్ద‌తు ఇవ్వాలి. అప్పుడే ఆయ‌న అనుకున్న ఆ న‌ల‌భై మంది గెల‌వ‌డం సులువు.

Read more RELATED
Recommended to you

Latest news