తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిన్నటి వేళ గొప్పగా వేడుకలు జరిగాయి. నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నాళ్లకు పెద పండగవచ్చె అని పాడుకుంటూ వాకిళ్లకు మామిడాకు తోరణాలు కడుతూ.. గుమ్మాలకు పసుపు కుంకుమలు అద్దుతూ.. దవళ వస్త్రాలలో మెరిసిపోయారు నేతలు. వారింటి బిడ్డలు కూడా! ఏ నేపథ్యం లేని వారికి కూడా టీడీపీ ఆ రోజు ఆదరణ వచ్చేలా చేసింది. అందుకు ఎన్టీఆర్ ఛార్మింగ్ తోడయింది. అప్పట్లో చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారిని కూడా ఇటుగా తీసుకువచ్చి, బీసీ కోటాలో టిక్కెట్టిచ్చి దగ్గరుండి గెలిపించుకుంది. ఆంధ్ర రాష్ట్రం అంతా కాంగ్రెస్ జపం చేసే వేళలో ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది.ఆ విధంగా ఎన్టీఆర్ గెలిచాడు. తరువాత ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో ఓడిపోయాడు. సొంత పార్టీనే వద్దనుకుని బయటకు వచ్చేశాడు.
వచ్చేక ఆయన తనకుతానుగా నిలదొక్కుకోలేకపోయారు. సొంతంగా మరో పార్టీ పెట్టి కూడా నిలదొక్కుకోలేకపోయారు. ఇక చంద్రబాబు హయాంలోకి పార్టీ వచ్చేటప్పటికీ ఆయన తీరు కారణంగా పూర్తిగా ఆధునికీకరణకు నోచుకుంది. హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఆ క్రమంలో ఎన్నో పాలన సంబంధ సంస్కరణలు తెచ్చారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ ప్రయాణం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో హైద్రాబాద్ ను అభివృద్ధి చేసి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ను నిర్వహించారు. హైటెక్ సిటీ రూపకల్పనకు కృషి చేశారు. టెక్ హైద్రాబాద్ గా ఆ ప్రాంతాన్ని మలిచారు.ఇవాళ మాదాపూర్ అన్నది ఎన్నో కార్పొరేట్ వెలుగులకు ఆనవాలు.
రాష్ట్రం విడిపోయాక మళ్లీ సీఎం అయ్యారు చంద్రబాబు.ఈ సారి రాజధాని నిర్మాణంకు పూనికవహించారు. అమరావతి పేరిట కృష్ణా గుంటూరు పరిసరాల్లో 30 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ చేసి కొన్ని నిర్మాణాలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చారు.
మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించారు.ఇదంతా ప్రజా ధనం కానీ జగన్ ఇవేవీ వద్దని అంటున్నారు అని చంద్రబాబు మథన పడుతున్నారు. ఒకప్పుడు చాలా స్పీడుగా ఉన్న టీడీపీ ఇప్పుడు అస్సలు ఉనికిలోనే లేకుండా పోతోంది. లోక్ సభలో మూడంటే మూడు సీట్లు ఉన్నాయి. ఈ దశలో వచ్చే ఎన్నికలపైనే ప్రేమ పెంచుకుంటున్నారు బాబు. కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ లెక్కన నలభై శాతం మంది కొత్త వారే రానున్నారు. 70 మంది యువతకు రానున్న కాలంలో ఎమ్మెల్యేలుగా పోటీచేసే అవకాశం ఇవ్వనున్నారు.అయితే ఇందులో 40 సీట్లు గెలుచుకున్నా చాలు టీడీపీ పరువు నిలబడుతుంది.