మల్టీస్టారర్‌ అర్థం తెలియని టాలీవుడ్‌ & మీడియా

-

టాలెంట్‌ అనేది ఎవడికీ సొంతం కాదు.. కష్టపడితే ఎవ్వరైనా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు… ఇదే మన ఆర్‌జీవి స్టైల్‌లో చెబితే ఎవడబ్బ సొత్తు కాదు రా టాలెంటు..

సూటిగా సుత్తి లేకుండి చెప్పుకుందాం…

నటుడు, హీరో, స్టార్‌.. ఇదీ లైన్‌.. మన తెలుగు సినిమా, తెలుగు మీడియా ఎందుకో ఈ లైన్‌ని వదిలేస్తున్నారు. నటుడి కానీ వాడిని కూడా స్టార్‌ చేసేస్తున్నారు. కేవలం సినిమా మీద హైప్‌ పెంచడానికి.. అసలు స్టార్‌ హీరో అంటే..? ఎవరినీ స్టార్‌ హీరో అంటారు..? స్టార్‌ హీరో కెపాసిటీ ఎంటీ..? ఈ ప్రశ్నలకు సమాధనాలు అందరికీ తెలిసినవే..

సినిమా విడుదల అవుతుందంటే థియేటర్లు హౌస్‌ ఫుల్‌ కావాలట… ఆ హీరో పేరుతోనే సగం బిజినెస్‌ జరిగిపోవాలంట.. ఫ్యాన్‌ బేస్‌ బట్టి హీరో స్టామినా తెలుస్తుందంట.. ఇదీ మా మాలోకంగాడి సమాధానాలు..


అంతేగా.. అంతేగా..

స్టార్‌ హీరోలకుండాల్సిన కొన్ని లక్షణాలు ఇవైతే.. మరి కనీసం సత్తా లేని, హిట్టు మొఖం చూడని హీరోలను స్టార్‌లు అనేస్తున్నారు మన తెలుగు సినిమా వాళ్లు ఇంకా మీడియా..

రెగ్యులర్‌ హీరోలకు అభిమానులు అంతగా ఉండరు కాబట్టి, ఓపెనింగ్‌ కలెక్షన్‌లలో తేడా ఉంటుంది. స్టార్‌ హీరోలకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో ఓపెనింగ్స్‌ అదిరిపోతాయి. కానీ, ఇదంతా ఒక వారమే. సినిమా బాగుంటే, రెండోవారంనుండే కలెక్షన్స్‌ నిలకడగా ఉంటాయి. చాలారోజులవరకు ఉంటాయి కూడా. ఇక్కడ స్టార్‌, హీరో అనే తేడాలుండవు. సినిమా బాగాలేకపోతే, ఎంత తురుమ్‌ఖాన్‌ హీరో అయినా ఏం చేసేది లేదు. ఆగడు, బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి చూసారుగా.. అదే సినిమా బాగుంటే, అసలు హీరోతో పనే లేదు. మహానటి చూసాం కదా.

స్టార్‌ అంటే, సొంతంగా, ఆయనకున్న వ్యక్తిగత చరిష్మా మీద బిజినెస్‌ జరగాలి. దాంతోనే ఓపెనింగ్స్‌ రావాలి. అటువంటి నాయకులు ఇద్దరు-ముగ్గురు కలిసి నటిస్తేనే అది మల్టీస్టారర్‌ అవుతుంది. అభిమానులను నమ్ముకుంటే సర్వనాశనమే. ఎవరైనా కథానాయకుడు గొప్ప నటుడైతే, ప్రేక్షకులందరూ అభిమానిస్తారు. తన సినిమా చూడాలనుకుంటారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కమలహాసన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, అమితాబ్‌, షారుఖ్‌… ఇలా. మరి వీళ్లకూ ఫ్లాప్‌లున్నాయి కదా. ఎవరైనా సినిమా బాగుండాలి…దట్సాల్‌. రిలీజ్‌రోజు ఫ్లెక్సీలు కట్టి, టపాసులు పేల్చి, పాలాభిషేకం చేసి,  వీరవిహారం చేసేవాడెవడూ అభిమాని కాదు. వాళ్లను చూసి వాపును బలుపు అనుకోకూడదు. మహానటుడి స్థానం నిజమైన అభిమాని గుండెల్లో ఉంటుంది. ఫ్యాన్‌బేస్‌ అనేది ఒక ఒక భ్రమిత సంఖ్య. దానికేమీ స్టాండర్డ్స్‌ ఉండవు.

సినిమా అనేది జస్ట్‌… జస్ట్‌ ఎ గేమ్‌. కేవలం డబ్బులకోసం ఆడే ఒక పేకాటలాంటిది. ఎంత పెడితే ఎంతొస్తుంది అనే లెక్కలే ఇక్కడ ముఖ్యం. రామానాయుడు, అశ్వనీదత్‌, అరవింద్‌, దిల్‌రాజు లాంటి నిర్మాతలు స్టార్‌లను పెడితే కలెక్షన్లు బాగా ఉంటాయని తీసుకుంటారు తప్ప, వాళ్లు మహానటులని తీసుకోరు.

ఎన్టీఆర్‌ – కృష్ణ, రామ్‌ చరణ్‌ – జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ – మహేష్‌బాబు, వెంకటేష్‌-మహేష్‌, నాగార్జున… ఇది లేదా ఇలాంటిది స్టార్‌ల కాంబినేషన్‌ (ఇంకొన్ని కాంబినేషన్‌లు ఉండొచ్చుగాక) అంటే..

అంతేగాని ఇద్దరు ముగ్గురు హీరోలు నటిస్తే ఆ కాంబినేషన్‌ను మనోళ్లు మల్టీస్టారర్‌ అనేస్తున్నారు. ఒక నటుడు హీరో కావడం ఒక ఎత్తయితే.. ఆ హీరో స్టార్‌ కావడం మరొక ఎత్తు.. స్టార్‌ హీరో కెపాసిటీ ఏంటీ?? ఎవరినీ స్టార్‌ హీరో అంటాము అనేది మనోళ్లకు తెలియపోవడం విడ్డూరం..

ఇంకా నటనలో ఓనమాలు రాని హీరోలను స్టార్‌లు అనేస్తున్నారు మన తెలుగు మీడియా. మొదటిసినిమా విడుదల కాకముందే ఫ్యాన్స్‌ అసోసియేషన్లు పెట్టేస్తున్నారు పనీపాటాలేని బేవార్స్‌ బ్యాచ్‌. ఇక్కడ అభిమానులు, కులాలను, మతాలను, ప్రాంతాలను బట్టి ఉంటారు గానీ, హీరోల నటనావైదుష్యాన్ని బట్టి కాదు. సినిమా నిర్మాతలకు, దర్శకులకు అంటే మల్టీస్టారర్‌ ట్యాగ్‌ తో నాలుగు పైసలు ఎక్కువ సంపాదించాలనేది ఉంటుంది.. మరి మీడియాకెందుకో దురద.. లేనిపోని ట్యాగ్‌లు తగిలియ్యడం ఎందుకో.. అల్లూ అర్జున్‌ సినిమాలో సుశాంత్‌.. ఇక్కడ అల్లు అర్జున్‌ స్టార్‌ కానీ సుశాంత్‌ స్టార్‌ హీరోనా?? నాని తో నటిస్తున్న సుధీర్‌ బాబు.. ఇక్కడ నాని స్టార్‌ హీరో మరి సుధీర్‌ బాబు..? సో తెలుసుకోవాల్సిందేంటంటే.. ప్రతీ సినిమాకు మల్టీస్టారర్‌ అనే ట్యాగ్‌ తగిలించి స్టార్‌ అనే పదానికి ఉన్న విలువను తీయ్యొద్దు..

– RK

Read more RELATED
Recommended to you

Latest news