ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన మనోహర్.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు చెప్పడం తప్ప వైసీపీ పాలకులు.. యువతులకు, మహిళలకు ఇసుమంతైనా రక్షణ ఇస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన బాధాకరమని, కొల్లూరు మండలం చిలమూరులోనూ పట్టపగలే ఓ మహిళ హత్యకు గురవ్వడం దురదృష్టకరమని మనోహర్ అన్నారు. ఒక సంఘటన మరువక ముందే మరో సంఘటన జరుగుతోంది.. ఇంత జరుగుతోన్నా.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ఆయన ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. సీఎం ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున గతేడాది జులైలో సామూహిక అత్యాచారం చోటు చేసుకొంటే ఇప్పటికీ ఓ నిందితుడిని పట్టుకోలేదు.. వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలు గాలికొదిలేసిందని ఆరోపించారు.