పాటకు ఒక నిర్వచిత ప్రావస్థ కావాలి. ఆ విధంగా అనిర్వచనీయ ధోరణి అనుభూతి వాదం కావాలి. ఆ ధోరణిలో దృక్పథంలో ఎవరికి వారే కొత్త దారులు వెతుక్కోవాలి అన్నది ఓ ప్రతిపాదన. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తూరుపు వాకిట వెలుగు.. ఉత్తరాంధ్ర నుంచి భాగ్యనగరి వైపు ప్రయాణించిన వెలుగు అని రాయాలి. ప్రాథమికంగా కవి అని ఓ ప్రతిపాదన ఎప్పుడో ఎవ్వరో చేసే ఉంటారు. వీటిని సైద్ధాంతిక ప్రతిపాదనలు అని చెప్పాలి.. ఇది పాఠ్యాంశ సంబంధం, పఠనాంతరం కూడా ! సిరివెన్నెల పాటల్లో తత్వం ఉంటుంది. నేను మాత్రమే అన్న అహం కూడా ఉంటుంది. వీటితో పాటే గతి ఉంటుంది. గతి చెడని గతి మంచి పాటకు ఆలంబన అని అయి ఉంటుంది. ఆ విధంగా ఈ వెన్నెల కవికి ఇవాళ నివాళి.
ఎక్కడిది ఈ గళం.. ఎక్కడిదీ స్వరం.. మౌన శిలలను చైతన్య మూర్తులుగా మలచడం సాధ్యమా??ఇది ఎవరిదో ప్రశ్న..నాది కానిదేదీ నాది కాదు కదా! అంతరంగానికి ఇదిగో ఇదే నీ వేదనకు నివేదన అని ఏ అక్షర రూపాన్ని చూపగలం..మనిషికేనా మాటకూ వర్ఛస్సు ఉంటుంది.. పాటకు యశస్సు ఉంటుంది.. అది నాలో లయం.. అది అనాది రాగం..ఆదితాళం.. సామవేద జనితం సరస స్వర సుర ఝరీ గమనం.. ఔనండి ఈ పాటలో కొద్దిగా సంస్కృతం ఎక్కువయ్యింది.మీ ఆలోచనలు సంస్కరించగ వచ్చిన పాట కదా ఇది!! అలానే ఉంటుంది! రండి ఒక్కసారి ఎల్లారెడ్డిగూడకి పోదాం. లేదా అనకాపల్లిపోదాం.చేంబోలు వారింటి అబ్బాయి అమలాపురం ఆర్ఎస్ఎస్ సభల లో పాటలు పాడిన రోజులు పలకరించి వద్దాం.. తప్పో ఒప్పో ఆ అహంకారాన్ని అంగీకరిద్దాం. ఆ సరస్వతి రూపానికి ప్రణమిల్లుదాం. ఔనండి! ఇది జీవన వేదం కదా! గుండె గూటి నుంచి పల్లవించిన ఓ గొప్ప పాట కదా! మీ నేలలోనో మీ నింగిలోనో ఈ పాట మూలాలు ఉంటాయి వెతకండి.