సచివాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీశాఖలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసే ఉద్యోగులకు స్థానచలనం కలిగించాలని అధికారులకు సూచించారు. జిల్లాల విభజన తరువాత అన్ని డివిజన్లు, సర్కిళ్ళలో సిబ్బంది సంఖ్యను క్రమబద్దీకరించాలని ఆయన ఆదేశించారు. హేతుబద్దంగా పోస్ట్ లు ఉండేలా చూడాలని, రాష్ట్రంలో ప్రతి యుఎల్బీ పరిధిలో ఒక నగరవనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది రూ.18.02 కోట్లతో ఆరు నగర వనాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఎకో టూరిజం కోసం రూ.15 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో 49,732 హెక్టార్లలో ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా ప్లాంటేషన్‌తో పాటు.. పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగరవనాల ఏర్పాటు చేయాలన్నారు. పులికాట్, నేలపట్టు, కోరంగి, పాపికొండలు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేయాలని, అరకు ప్రాంతంలో జంగిల్ రిసార్ట్స్ ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.