ఫస్ట్ కాజ్ : సకాలంలో వైద్యం అందక ప్రసవానంతరం బిడ్డ మృతి నరకం చూసిన గర్భిణి
మీరేమయినా చెప్పగలరు కానీ మీరేం చెప్పినా వాటికి ఆచరణ రూపం ఇచ్చేవారు ఇక్కడ ఎవ్వరూ ఉండరు.. మిగతా విషయాలన్నీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్పటికైనా మాట్లాడితే మేలు. మంచి జరిగి మార్పు వస్తే ఇంకా మేలు. వస్తుందని ఆశ తో ఈ ఉదయం.. రాదన్న నిరాశతో నిన్న.. ఇవే మా జీవితాలు సర్.. మీరు డిస్ట్రబ్ చేయకుండ్రి.. మీ కాల్మొక్కుతాం బాంచెన్ ..అని అంటోంది పేద హృదయం. ఏం కాదు ఈ కన్నీటి ప్రవాహాలకు జవాబులు ఉండవు. మృత్యుహేలలు అలానే ఉంటాయి. రాజకీయం ఒకటి బతకాలి.. రంగుల రాజకీయం ఒకటి వెలగాలి.. సల్లంగుండాలి అంతా సక్కంగుండాలి… ఆస్పత్రుల్లో వైద్యులు ఏమౌతున్నారని? ఎటు పారిపోయి జీతాల వేళకు కనిపిస్తున్నారని? ఆరాతీయండి సీఎంగారూ! ఈ ప్రాణానికి ఖరీదు వద్దులే..కానీ నిర్వహణ లోపాలను అస్తవ్యస్త అధికార యంత్రాంగాన్ని దార్లోకి తెండి.. ఇదొక్కటే మా విన్నపం.
ఆవిర్భావం అంటే ఏంటి సర్.. రంగురంగుల ప్రకటనలే కదా అని ఓ విమర్శ ఉంది. విమర్శ ను, తిట్టును తిప్పి కొట్టేందుకు పాలక పక్షం సిద్ధంగానే ఉంది. వాస్తవాలే ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కడు బీదరికం నుంచి వచ్చిన కుటుంబాలకు ఇప్పటికీ సర్కారీ వైద్యమే కదా దిక్కు. బస్తీ దవాఖానాలు ఏం చేస్తున్నాయి. ఏం మాటలు చెబుతున్నాయి. ఏం పనులు చేస్తున్నాయి. ఈ ఘోరం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో జరిగింది. మరి! కేటీఆర్ దగ్గరకు ఎవరు పట్టుకుపోతారు ఈ విషయాన్ని. ఎవరు ఆ చనిపోయిన బిడ్డకు ప్రాణం తిరిగి పోస్తారు. తాము అందించే మంచి పాలనకు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని తరుచూ చెప్పే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ మరణం విషయమై ఏ విధంగా స్పందిస్తారు ?
బంగారు తెలంగాణ అంటూ ప్రతిరోజూ ఓ చక్కని మాట వింటుంటాం. తినేందుకు, ఉండేందుకు, బతికేందుకు అట్టహాసాలతో కూడిన జీవితం ఏమీ అక్కర్లేదు కానీ కనీస స్థాయిలో వైద్యం, ఆహారం, ఆరోగ్యం మరియు ఆనందం అందితే చాలు. వీటి గురించి పాలకులతో మాట్లాడితే కోపాలు వస్తాయి. గ్రోత్ రేట్ బాగుందని చెప్పే పాలకులు నిన్నటి వేళ సిరిసిల్లలో జరిగిన ఓ ఘటనకు స్పందిస్తే చాలా బాగుంటుంది. వీర్నపెల్లి మండలానికి చెందిన లోకుర్తి నాగరాజు, మాధవి అనే దంపతుల దీన గాధ ఇది. పురిటినొప్పులతో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి వచ్చిన ఆమెకు సకాలంలో వైద్యం అందలేదు. బాత్రూంలోనే ఆఖరికి ప్రసవించింది. బిడ్డకు సకాలంలో వైద్యమే లేదు. దాంతో ఆ బిడ్డ కనుమూసింది. ఇప్పుడీ తల్లికి గర్భశోకం ఎవరు తీరుస్తారు?