మహేష్ నటించనున్న 26వ చిత్రంలో విజయశాంతి నటిస్తుందని తెలిసింది. ఆమె ఆ సినిమాలో మహేష్‌బాబుకు అత్తగా నటించబోతున్నదట.
విజయశాంతి.. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమె తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులను విజయశాంతి తన నటనతో అలరించింది. అగ్రహీరోలందరితోనూ విజయశాంతి సినిమాలు చేసింది. 180కి పైగా సినిమాల్లో నటించిన విజయశాంతి అనేక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకుంది. అయితే అదంతా గతం. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశాక.. సినిమాల్లో నటించలేదు. అయితే త్వరలో విజయశాంతి వెండితెరపై మరోసారి దర్శనమివ్వనుందట. ఆమె సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది.
మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి రేపు విడుదల కానున్న విషయం విదితమే. ఇది మహేష్‌కు 25వ సినిమా కాగా.. మహేష్ నటించనున్న 26వ చిత్రంలో విజయశాంతి నటిస్తుందని తెలిసింది. ఆమె ఆ సినిమాలో మహేష్‌బాబుకు అత్తగా నటించబోతున్నదట. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ సినిమాలో నటించే విషయమై చిత్ర దర్శక నిర్మాతలు విజయశాంతిని సంప్రదించారని తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
విజయశాంతి 1979లో సినీ రంగ ప్రవేశం చేయగా, నటుడు చిరంజీవితో కలసి అనేక చిత్రాల్లో ఆమె నటించింది. ఈ క్రమంలోనే వీరిద్దరి జంటకు హిట్ పెయిర్ గా పేరుంది. అలాగే విజయశాంతి బాలకృష్ణతోనూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కాగా ఆమె 1998లో బీజేపీలో చేరింది. అనంతరం 2009లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది. ఆ తరువాత దాన్ని ఆమె టీఆర్ఎస్‌లో విలీనం చేసింది. అనంతరం టీఆర్ఎస్‌లో మెదక్ ఎంపీగా ఆమె బాధ్యతలు నిర్వహించింది. ఆ తరువాత టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరింది. ఈ క్రమంలో ఆమె రాజకీయాల్లో ఉన్న కారణంగా సినీ రంగానికి దూరమైంది.
2006లో విజయశాంతి నాయుడమ్మ సినిమాలో ఆఖరి సారిగా నటించగా.. అప్పటి నుంచి 13 ఏళ్ల పాటు ఆమె ఏ సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే త్వరలో సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమె మహేష్ బాబు సినిమాలో నటించే విషయమై సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆమె ఆ సినిమాలో నటించే విషయం నిజమే అయితే.. రాములమ్మను వెండితెరపై మరోసారి చూడవచ్చన్నమాట..!