శ్రీకాకుళం జిల్లా వంశధార నిర్వాసితులను ఆదుకునేందుకు సీఎం ముందుకు రావడం ఓ శుభపరిణామం. అనుకున్నదే తడవుగా మరోసారి వారికి పరిహారం ఇవ్వడం ఓ మంచి మార్పు కూడా! మొత్తం 27 మంది లబ్ధిదారులకు 216.71 కోట్లు అందించి, నిన్నటి వేళ స్పీకర్ సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మంత్రి సీదిరి అప్పలరాజుతో సహా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి బాధితులకు మరోసారి భరోసా ఇచ్చారు.
ఇప్పటికిప్పుడు 14 వేల అకౌంట్లకు నేరుగా నిధులు జమ అయ్యాయని, మిగిలిన అకౌంట్లకు కూడా త్వరలోనే నిధులు జమ కానున్నాయని చెప్పారు ప్రభుత్వ ప్రతినిధులు. ఈ నెల 27న సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నిన్నటి వేళ ఆయన ఆదేశాల మేరకు తిత్లీ తుఫాను బాధితులకు సాయం అందించారు. పలాస మండలం, బొడ్డపాడు గ్రామంలో 182 కోట్లకు పైగా సాయం అందించారు. ఈ సాయంను సీఎం ఆదేశాల మేరకు అధికారులు మరియు ప్రభుత్వ ప్రతినిధులు 90,789 మంది రైతులకు అందించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా చరిత్రలోనే ఒక పూర్తయిన ప్రాజెక్టుకు మళ్లీ పరిహారం పేరిట నిధులు అందించి బాధితులను ఆదుకున్న ఘనత సీఎందేనని ఈ సందర్భంగా వక్తలు చెప్పారు. “14 వేల ఎకౌంట్లకు నిర్దేశిత మొత్తాలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మిగతా వారికి కూడా డబ్బులు పడలేదని ఆవేదన అక్కర్లేదు. వారికి కూడా త్వరలోనే డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం బీదల ప్రబుత్వం బలహీనుల ప్రభుత్వం అట్టడుగున వర్గాలు గౌరవంగా బతికేలా చేసే ప్రభుత్వం. నిర్వాసితులకు గతంలో ఎన్నో లంచాలు నడిచేయి ప్యాకేజీల పేరిట ! కానీ ఇప్పుడు అలాంటివి లేవు. అభివృద్ధి లేదు లేదు అని పదే పదే అంటున్నారు. అభివృద్ధిలో భాగంగా వంశధార ప్రాజెక్టు నిర్మించడం లేదా ? అదేవిధంగా మీ గ్రామంలో ఉండే బడులు, వెల్ నెస్ సెంటర్లు , సచివాలయాలు, ఆర్బీకేలు ఇవన్నీ అభివృద్ధిలో భాగం కావా ? అదేవిధంగా పేదవాడు గౌరవంగా బతికే అవకాశం ఇస్తోంది. అందుకే ఇతర నాయకత్వాల కన్నా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం సమగ్రమైంది అని చెప్పక తప్పదు” అని పలువురు వైసీపీ ప్రభుత్వ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కీలకంగా ఉన్న రెండు సమస్యలనూ పరిష్కరించడంలో జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు కలెక్టర్ కూడా చొరవ చూపారు. ఏదేమయినప్పటికీ ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న విధంగా తమకు సాయం అందడంతో సంబంధిత లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది.