మనుషులను కష్టాలు శాసిస్తాయి. మనుషులను పురుగూ పుట్టా కూడా శాసిస్తాయి. సూక్ష్మం అయిన వాటికి కూడా శాసించే లక్షణం కొన్ని సార్లు వి లయాలకు కారణం. అవును కదా ! మైక్రో స్కోపునకు అందే లేదా చిక్కే సూక్ష్మ జీవి ప్రపంచాన్నే నాశనం చేసేందుకు సన్నద్ధం అయింది. వైద్యం దేవుడు వేర్వేరు కాదు. కనుక నారాయణుడి రాక తో కొన్ని రుగ్మతలు పోతాయి అని భావిస్తారు. వైద్యో నారాయణో హరిః అని వ్యవహరిస్తారు. సామాజిక సంస్కరణలకు భక్తి కారణం కావాలి. ఒకప్పుడు అయింది. మళ్లీ ఇప్పుడు కావాలి. అటువంటి కాలాన్ని మనం ఆహ్వానించి అక్కున చేర్చుకుని సొంతం చేసుకోవాలి. దైవం అంటే మార్పునకు కారణం. మార్పునకు సాయం అని కూడా అంటారే ! అదే నిజం.. మంచి మార్పు పూరీ జగన్నాథుని ఆలయం చెంత ! మంచి మార్పు మీలో మరియు నాలో ! అన్నింటికీ ప్రేరకుడు దేవ దేవుడే అన్న విశ్వాసం ఒకటి ఉన్నతమైనది.
దేవుడికో స్వాగతం పలికిన ప్రజలు నిన్నటి వేళ పులకించిపోయారు. జగన్నాథుని రథ చక్రాలు ఊళ్లోకి వస్తూ వస్తూ ఉంటే ఆ… ఆగమనాన్నీ, ఆ రాకనూ స్వాగతిస్తూ పులకించిపోయారు. భగవంతుడు తొమ్మిది అవతారాల్లో తొమ్మిది రోజుల పాటు దీవించి వెళ్లే గొప్ప పండుగకు శ్రీకారం దిద్దిన వేళ జనం ఆనంద తాండవం చేశారు.
రెండేళ్ల కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడికక్కడ అన్నీ నిలిచిపోయిన కారణంగా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు కూడా రాలేని కారణంగా చాలా ఉత్సవాలు ఏకాంత ఉత్సవాలుగానే మిగిలాయి. మాయదారి మహమ్మారి కారణంగా ఎన్నో కోల్పోయిన ప్రజలు దేవ దేవుడి సన్నిధిలో తమకు ప్రశాంతతను ప్రసాదించమని అడిగేందుకు పూరీ జగన్నాథుని ఆలయానికి చేరుకున్నారు. లక్షలాది ప్రజలు దేవదేవునికి జయజయ ధ్వానాలు చేస్తూ ఆత్మ నివేదన చేసుకున్నారు.
ఆనందానికి పరమావధిని తెలుసుకునే ప్రయత్నం ఒకటి ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా తక్షణ కారణాలు అందుకు వెతుక్కోలేకపోయినా దేవుడి చెంత పొందే తాత్కాలిక ఉపశమనం ఎంతో గొప్పది అన్నది భక్త జనం నమ్మకం. ఈ నమ్మకానికి అనుగుణంగానే నిన్నటి వేళ పూరీ జగన్నాథుని ఆలయం దగ్గర దైవ నామస్మరణ మార్మోగిపోయింది. ఈ నమ్మకానికి అనుగుణంగానే కొత్త ఆనందాల వెలికితీత అన్నది సాధ్యం అయింది. ఆనందానికి నిలయంగా మారే ఆ వేళ ప్రతి హృదయం ఓ ఆలయం.