రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండో రోజు దిల్లీ పర్యటనలో కేసీఆర్.. రాజధానిలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి 8.30 గంటల వరకు సాగింది.
ఈ సమావేశంలో.. రాష్ట్రప్రభుత్వ అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన చర్చించారు. అవసరమైతే ఈ విషయంలో న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించారు. ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం)పై పరిమితులు విధించడం, ఇతరత్రా రుణలను కేంద్రం అడ్డుకుంటున్న తీరుపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు.
‘ఏటా ఎఫ్‌ఆర్‌బీఎంను కేంద్రం ప్రకటిస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లను రూపొందించుకుంటాయి. ఈసారి తెలంగాణ పరిమితిని తొలుత రూ.53,000 కోట్లుగా ప్రకటించి.. తర్వాత రూ.23,000 కోట్లకు కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం రుణసాయం పొందకుండా నిరోధించేందుకే కేంద్రం ఈ ఎత్తుగడ వేసింది. మొదటినుంచీ రాష్ట్ర సర్కారు ఆర్థిక క్రమశిక్షణతో ఉంది. పరిధి మేరకు తెలంగాణ ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయి. వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను పైసా కూడా ఎగ్గొట్టకుండా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, పాలనలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంపై కేంద్రం ఇలాంటి ధోరణిని ప్రదర్శించడం దారుణం. దీన్ని ఎదుర్కొందాం ఈ అంశాల్లో తొలుత ఆర్థిక, ఇతర సంబంధిత అధికారులను కలుసుకొని చర్చించాలి’ అని రాష్ట్ర ఉన్నతాధికారులు సూచించారు.
రాష్ట్ర అధికారులు.. కేంద్ర అధికారులతో భేటీ అయిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసే అంశంపై సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్‌శాఖ ముఖ్య కమిషనర్లు రామకృష్ణారావు, రజత్ కుమార్, సునీల్‌శర్మ, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ హరిరాం పాల్గొన్నారు.