కోమటిరెడ్డి ఫిక్స్…కానీ అదే డౌట్?

-

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే..ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లో పనిచేస్తూ వచ్చిన రాజగోపాల్…గత కొద్దికాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే క్రమంలో ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే ఈ మధ్య అమిత్ షా తో భేటీ అయిన రాజగోపాల్..బీజేపీలో చేరిక లాంఛనమైంది. అయితే మీడియాలో లీకులు రావడంతో రాజగోపాల్ సైతం ఓపెన్ కావాల్సి వచ్చింది.

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ని ఎదురించే సత్తా బీజేపీకే ఉందని, కాంగ్రెస్ పని అయిపోయిందని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనం తట్టుకోలేక కాంగ్రెస్ ని వీడుతున్నట్లు రాజగోపాల్ చెబుతున్నారు..ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలోని అనుచరులు, కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతూ..బీజేపీలో చేరేందుకు రాజగోపాల్ చర్చలు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ లో తనకు చాలా అవమానాలు ఎదురయ్యాయని కార్యకర్తలతో చెప్పారు.

గతంలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా తననే సీఎల్పీ నాయకుడిగా చేయాలని కోరినా.. అధిష్ఠానం పట్టించుకోలేదని, పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఇచ్చారని, షబ్బీర్‌ అలీ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన 21 మంది కమిటీలో తనను ఒక సభ్యుడిగా ప్రకటించి అవమానించారని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. ఇక బీజేపీలో తనకు సరైన గౌరవం దక్కుతుందని, తనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని, ఇంకా బీజేపీలోకి వెళ్ళక తప్పదని చెప్పి రాజగోపాల్…తన అనుచరులు, కార్యకర్తలతో చెబుతున్నారు.

దీని బట్టి చూస్తే రాజగోపాల్ బీజేపీలో చేరడం ఖాయమే..అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికని ఎదుర్కోవడం కూడా దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. అంతా ఓకే గాని..మునుగోడులో పూర్తి స్థాయి కేడర్ రాజగోపాల్ వైపు రావడం డౌటే అని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు సడన్ గా బీజేపీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాజగోపాల్ తో బాగా క్లోజ్ గా ఉన్న వారు తప్ప..కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉన్నవారు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు లేవు. పైగా నల్గొండ జిల్లాలో బీజేపీకి పట్టు లేదని కొందరు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో కేడర్ రాకపోతే రాజగోపాల్ ఉపఎన్నికలో కాస్త రిస్క్ ఎక్కువ ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news