ఆగస్టు 5న ఉస్మానియా యూనివర్సిటీలో 82వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే, చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరవుతారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనుండడం గమనార్హం. అంతకుముందు 2001లో చివరిసారి ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్ నేత్రావలికి గౌరవ డాక్టరేట్ అందించింది.
ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీ 105 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 81 స్నాతకోత్సవాలు నిర్వహించి 47 మందికి గౌరవ డాక్టరేట్లు అందించింది. ఓయూ నుంచి తొలి డాక్టరేట్‌ను 1917లో నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్ అందుకున్నారు. ఆ తర్వాత విశ్వకవి రవీంద్రానాథ్ ఠాగూర్, సి.రాజగోపాలాచారి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బీఆర్ అంబేద్కర్, డాక్టర్ వై.నాయుడమ్మ, డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులు ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ వారి సరసన చేరనున్నారు.