కేంద్ర జల్ శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు కాళేశ్వరం అవినీతిపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పి చూశామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తే పెడచెవిన పెట్టారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయనే అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మాటలు సరే ముందు చర్యల సంగతి ఏంటో చెప్పాలని షెకావత్‌ను రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
గోదావరికి వచ్చిన భారీ వరదతో మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 కీలక పంపుహౌస్‌లు నీట మునిగాయి. కాళేశ్వరం పనుల్లో అవినీతి జరిగిందని.. నాణ్యత లేకపోవడం వల్లే పంపుహౌస లు మునిగాయని ప్రతిపక్షాలు కోడై కూశాయి. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసమే కట్టారని కేంద్ర మంత్రులు కూడా విమర్శలు చేశారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు ట్వీట్ చేశారు.
షెకావత్ జీ…
మీ తీరు చూస్తుంటే అరిచే కుక్క కరవదు అన్న సామెత గుర్తొస్తోంది.
కాళేశ్వరం అవినీతి పై చర్యలకు కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తే మీరు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారు.మాటలు సరే… చర్యల సంగతి చెప్పండి సార్! pic.twitter.com/bsoeJOlXm8
— Revanth Reddy (@revanth_anumula) August 18, 2022