ఒకప్పుడు సినిమాలకు ఒక్క విడుదల తేదీ మాత్రమే ఉండేది. ఎందుకంటే అప్పుడు థియేటర్లోనే మాత్రమే అవి సందడి చేసేవి. కానీ ఓటీటీ రాకతో ఇప్పుడంతా మారిపోయింది. ప్రతి చిత్రానికి రెండు రిలీజ్ డేట్లు ఉంటున్నాయి. అయితే జులైలో విడుదలైన సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయడంతో సినీ ప్రియుల దృష్టంతా ఆగస్టులో రిలీజ్ అయిన మూవీస్‌పై పడింది. అవీ అతి త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయంటూ సోషల్‌మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. ‘ఫలానా ఓటీటీలోకి.. ఫలానా చిత్రం.. స్ట్రీమింగ్ అప్పుడే’ అనే పోస్ట్‌లు నెట్టింట కనిపిస్తున్నాయి. అయితే, ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికంటే ముందే విడుదలకావడంతో ‘బింబిసార’, ‘కార్తికేయ 2’, ‘సీతారామం’ లాంటి సూపర్‌హిట్ చిత్రాలూ మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తాయని సమాచారం. అయితే, ప్రస్తుతం థియేటర్లో వాటికున్న ఆదరణ, త్వరలో విడుదలయ్యే కొత్త చిత్రాల విజయావకాశాలను బట్టి వీటి ఓటీటీ స్ట్రీమింగ్ ఆధారపడి ఉంటుంది. మరి సోషల్‌మీడియా ట్రెండ్ ప్రకారం ఆగస్టులో విడుదలైన సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు కానున్నాయంటే..
బింబిసార: సెప్టెంబరు 9 (జీ 5)
సీతారామం: సెప్టెంబరు 9 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
కార్తికేయ 2: సెప్టెంబరు ఆఖరి వారంలో (జీ 5)
మాచర్ల నియోజకవర్గం: సెప్టెంబరు 9 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
విరుమన్: సెప్టెంబరు 9/10 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
తిరు: సెప్టెంబరు ఆఖరి వారంలో (నెట్‌ఫ్లిక్స్/ సన్‌నెక్ట్స్)
లాల్‌సింగ్ చడ్డా: వూట్ సెలెక్ట్
రక్షాబంధన్: జీ 5
దొబారా: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీలో సినిమా విడుదలపై నిర్మాతలంతా కీలక నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించకపోవడంతో త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని కొందరు అంటుంటే.. నిబంధనల ప్రకారం 50- 60 రోజులు పూర్తి చేసుకున్న తర్వాతే వస్తుందని మరికొందరు అంటున్నారు. ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాల ఓటీటీ విడుదలపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.