డెలివరీ తర్వాత ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..?

-

మహిళలు ప్రసవించడం అంటే పునర్జన్మ ఎత్తడం అని అంటారు. అంటే బిడ్డ పుట్టే అప్పుడు తల్లి పడే వేదన ఆ రేంజ్ లో ఉంటుందని. ప్రసవం అప్పుడే కాదు డెలివరీ తర్వాత కూడా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేవలం శారీరక ఇబ్బందులే కాదు మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రసవం తర్వాత శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు జరుగుతాయని అంటున్నారు. అయితే కొన్ని మార్పులు మహిళలను కుంగదీస్తాయట. అందుకే వాటి నుంచి త్వరగా కోలుకోవడానికి డాక్టర్లు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వమని చెబుతున్నారు. అవేంటంటే..?

సాధారణ కాన్పు అయినా.. సిజేరియన్ అయినా ఓ వారం పాటు మహిళల్లో రక్తస్రావం అవుతుంది. ఈ సమయంలో శానిటరీ నాప్కిన్స్ మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని మార్చినప్పుడల్లా జననేంద్రియాన్ని వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. రక్తస్రావం ఎక్కువ ఉంటే మాత్రం డాక్టర్లను సంప్రదించాల్సిందే.

డెలివరీ సమయంలో ఒత్తిడికి గురయ్యే కండరాలను బలోపేతం చేయడానికి వైద్యుల సలహాతో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. సీ సెక్షన్ చేసినట్లయితే ఆ భాగంలో నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్స్ వాడాలి. నడక, కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే గోడకు ఎదురుగా నిలబడి రెండు చేతులు పైకెత్తి ఆ తర్వాత స్ట్రెచ్ చేసి కిందకు దించాలి. పొత్తి కడుపులో కండరాలు ఫ్రీగా అయినట్లు అనిపించే వరకు అలా చేస్తే సమస్య తగ్గుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇబ్బందిగా, నొప్పిగా అనిపిస్తే మీ శరీరం వ్యాయామాలకు సిద్ధం కాలేదని గుర్తించాలని, వెంటనే వైద్యుల సూచనలు పాటించాలని చెబుతున్నారు.

డెలివరీ తర్వాత పాల ఉత్పత్తి పెరగాలంటే యోగా చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. యోగా వల్ల శరీరానికి, మనసుకు ఉపశమన కలుగుతుందని అంటున్నారు. కండరాల్లో కలిగే ఒత్తిడి, ప్రసవంలో కలిగిన ఆందోళన యోగాతో దూరమవుతాయని చెబుతున్నారు. డెలివరీ తర్వాత కుంగుబాటుకు గురైన వారికి శవాసనం మంచి ఫలితాన్నిస్తుందని తెలిపారు. చిన్నపిల్ల భంగిమలో ఆసనమైతే రక్తప్రసరణ మెరుగు పడుతుంది. ఇది సాగిన పొత్తికడుపును యథాస్థితికి తీసుకొస్తుంది.

రొమ్ములో పాలు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు నవజాత శిశువు పూర్తిగా తాగలేక పోవచ్చు. దాంతో ఆ భాగమంతా పాలు గడ్డకట్టి నొప్పి కలుగుతుంది. అప్పుడు వేడి నీటిలో ముంచిన తువ్వాలును రొమ్ముపై పరిచి అయిదు నిమిషాలుంచాలి. ఆ భాగాన్నంతా మృదువుగా మర్దనా చేసి, తర్వాత పాపాయికి పాలుపట్టాలి. అదయ్యాక ఛాతీభాగం వద్ద ఐస్‌ గడ్డ పెట్టాలి. తరచూ ఇలా చేస్తే పాలు గడ్డ కట్టే సమస్య తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ప్రొటీన్లు, పీచు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాహారాన్ని ఎంచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం కావాలి. పాల ఉత్పత్తులు తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యం పెంపొందుతుంది. మసాలాలు, కెఫైన్‌, నిల్వ ఆహారాలు, ప్రాసెస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news