అమెరికాలో తుపాకీ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. అయితే తాజాగా.. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. ఆదివారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) హూస్టన్ సిటీలోని ఓ ఇంటికి దుండగుడు నిప్పంటించాడు. దీంతో అందులో ఉన్నవారు బయటకు పరుగులు పెడుతుండగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు మృతిచెందారు.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాము జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడని సిటీ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ తెలిపారు. దీంతో మొత్తం నలుగురు మృతిచెందారని వెల్లడించారు. బాధితులంతా 40 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులేనని చెప్పారు. నిందితుడు ఆఫ్రికన్-అమెరికన్ అని, పూర్తిగా నలుపు దుస్తులు ధరించి ఉన్నాడన్నారు. కాగా, ఈ నెల 24న మేరీల్యాండ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని మృతిచెందాడు.