ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో దారుణం జరిగింది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. తన కూతుళ్లపై అత్యాచారం చేసి హత్య చేశారని మృతుల తల్లి ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
‘నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను ఆరుగురు నిందితులు గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు కలిసి వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం జరిగిన తర్వాత తమను పెళ్లిచేసుకోవాలని నిందితులను ఆ అక్కాచెల్లెళ్లు వేడుకున్నారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం.’ అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ.. యోగి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.