మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం జోరందుకుంది. ఎవరికి వారే ఆయా పార్టీలు గెలువాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ప్రచారంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాను ఇంచార్జీగా ఉన్న చండూరు 2వ, 3వ వార్డుల్లో నేరుగా ఓటర్లను కలుసుకుని వారిని టీఆర్ఎస్కు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. ఎర్రబెల్లి విభిన్నంగా చేస్తున్న ప్రచారం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారంలో భాగంగా చండూరులోని పంట చేలల్లో పనిచేసుకుంటున్న రైతుల్ని, కూలీలను కలుస్తున్నారు. ట్రాక్టర్‌పై వెళ్తున్న కూలీలతో ముచ్చటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి పలకరిస్తూ యువకులను టీఆర్ఎస్లో చేర్పిస్తూ ఓటర్లతో ఫొటోలు దిగుతున్నారు. ఇలా అందరితో ఇట్టే కలిసిపోతూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల విజయం కోసం శ్రమిస్తున్నారు.
ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి ప్రసంగించారు. స్థానిక, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ఒకే పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి నల్లేరు మీద నడకలా అద్భుతంగా సాగుతుందని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. ఓటర్లు తెలివిగా ఆలోచించాలని చెప్తూ.. దూడకు గడ్డి పెట్టి, అవును పాలియ్యమంటే ఇస్తదా? అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం గీటురాయిలా పనిచేస్తున్న టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి చెప్తూ ఇలాంటి పథకాలను తెచ్చిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇకముందు కూడా ఈ పథకాలు అన్నీ అందాలంటే కేసీఆర్, కారు రావాలని పిలుపునిచ్చారు మంత్రి ఎర్రబెల్లి.