గవర్నర్‌ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టుకు కేరళ వీసీలు

-

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న పంజాబ్‌, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్‌లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీలకు వీసీల నియామకంలో కేరళ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదంటూ గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసీల రాజీనామాకు ఆదేశించారు. అంతేగాక ఇవాళ ఉదయం 11:30 గంటల లోపల వీసీల రాజీనామాలు తన ముందు ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

 

దీనిపై ఆ 9 యూనివర్సిటీల వైస్‌ ఛాన్సెలర్‌లు ఇవాళ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. వారి పిటిషన్‌లను స్వీకరించిన హైకోర్టు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ వీసీ నియామకం యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సుప్రీం కోర్టు ఇటీవల ఆ నియామకాన్ని రద్దు చేసింది.

అంతకు ముందు కూడా కేరళ సర్కారు మద్యం, లాటరీని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందంటూ గవర్నర్‌ మండిపడ్డారు. ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డా అని, త్వరలోనే కేరళ దాన్ని దాటేస్తదని గవర్నర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news