తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారిపోతున్నాయి..అసలు ఇక్కడ రాజకీయ పార్టీలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పటికప్పుడు పార్టీలు పెరిగిపోతున్నాయి. దీని వల్ల తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుతానికి టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో కూడా అలాగే నడుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీల మధ్యే పోటీ జరుగుతుంది. కాకపోతే ఇతర పార్టీల ప్రభావం కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఆ పార్టీలు ఓట్లు చీలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికలో బీఎస్పీ, టీజేఎస్, ఇతర స్వతంత్ర అభ్యర్ధుల వల్ల ఎవరికి నష్టం జరుగుతుందా అని మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు భయపడుతున్నారు. మునుగోడు పక్కన పెడితే..అసలైన అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల వల్ల నష్టం ఎవరికో తెలియడం లేదు.
టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఎంఐఎం, టీడీపీ, సిపిఐ, సిపిఎం, వైఎస్సార్టీపీ, బీఎస్పీ, టీజేఎస్ పార్టీలే కాకుండా ఇంకా చిన్నాచితక పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో జనసేన ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రకటించారు. ఎలాగో టీఆర్ఎస్కు కమ్యూనిస్టులతో పొత్తు ఉండవచ్చు. వారిని పక్కన పెడితే..బీఎస్పీ, వైఎస్సార్టీపీ, టీజేఎస్ల వల్ల ఎవరికి డ్యామేజ్ జరుగుతుందో తెలియట్లేదు.
కానీ టీడీపీ-జనసేన వల్ల టీఆర్ఎస్కే నష్టం జరిగేలా ఉంది. ఆ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేసిన, విడిగా పోటీ చేసిన సరే టీఆర్ఎస్కే నష్టం. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న సెటిలర్ల ఓట్లలో మార్పు కనిపించవచ్చు. గత కొంతకాలంగా గ్రేటర్లో ఉన్న ఏపీ ఓటర్లు టీఆర్ఎస్కే సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు టీడీపీ-జనసేన బరిలో ఉంటే వారు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా ఉంది. మొత్తానికి టీడీపీ-జనసేన వల్ల కారుకు నష్టం జరిగేలా ఉంది.