సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధి, శ్రీనగర్ కాలనీలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నరహరశెట్టి గంగాభవాని(86) సజీవన దహనమైంది. పోలీసులు వివరాల మేరకు.. టీచర్స్ కాలనీలో నివసిస్తున్న నరహరశెట్టి బాలకృష్ణ తల్లి గంగాభవానికి మతిస్థిమితం లేదు. అనారోగ్య కారణాలతో ఆమెను శ్రీనగర్ కాలనీలోని మరో ఇంట్లో ఉంచారు. ప్రతి రోజూ ఉదయం, రాత్రి వేళల్లో భోజనం తెచ్చిపెడుతుంటారు. తలుపునకు తాళం వేసి, తన ఇంటికి వెళ్లిపోతుంటారు. అదే విధంగా బుధవారం రాత్రి 10:30 గంటలకు తల్లికి భోజనం పెట్టి, తలుపులకు తాళం వేసి వెళ్లారు.
11 గంటల సమయంలో గంగాభవాని ఇంటి పక్కనున్న బాబావలి అనే వ్యక్తి ఫోన్ చేసి, మీ అమ్మ ఉన్న గదిలోంచి మంటలు వస్తున్నాయని ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే గంగాభవాని మృతిచెందింది. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గదిలో పరిశీలించిన విద్యుత్తు శాఖ అధికారులు.. విద్యుత్తు షార్ట్సర్య్కూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలిపారని సీఐ బాలమురళీకృష్ణ వివరించారు.