తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ నెల 15న టీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనున్నది. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరుగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనున్నది. సమావేశంలో శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్ రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్ననున్నారు.
ఇదిలా ఉంటే.. చివరగా గత సెప్టెంబర్ నెలలో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కంటే ముందు.. ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.