దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును చేర్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఇంతకాలం ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియాకు లీకులు ఇవ్వడం వరకే పరిమితమైన ఈడీ వర్గాలు.. మొదటి సారి సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్ రిపోర్ట్‌లో కవిత రోల్ ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చేశారు? ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను ఎవరు ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే విషయాలను కోర్టుకు వివరించారు. అంతేకాదు.. ఇంతకు ముందు సమర్పించిన చార్జిషీట్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేరు లేకపోవడం, కవిత పాత్రను ప్రస్తావించకపోవడంతో కేసు మొత్తం మద్యం వ్యాపారులకే పరిమితమైందనే సందేశం వెలువడ్డా.. తాజా రిమాండ్ రిపోర్టులో మనీశ్ ఈ కుంభకోణానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.
కవితతోపాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట, మనీశ్‌సిసోడియా.. ఇలా మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చారని.. ఆ తర్వాత ఆ ఫోన్లను ధ్వంసం చేశారని, అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో మద్యం వ్యాపారి, మనీశ్‌సిసోడియా కుడిభుజంగా చెప్పే అమిత్ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసి, సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి? ముడుపులు ఎవరెవరి చేతులు మారాయి? అనే విషయాలను వెల్లడించింది. అమిత్ అరోరా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టుపై కవిత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. దీనిపై కవిత ఏం మాట్లాడుతారని సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.