రోడ్డు ప్రమాదంలో ఒక్క ఏడాదిలోనే 1.5 లక్షలు మరణాలు..

-

రోజూ ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడే వాళ్లు కొందరైతే..అక్కడికక్కడే మరణించేవాళ్లు ఎందరో.. ఎన్నో ప్రాణాలను రోడ్లు బలితీసుకున్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాల డేటాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ వాడడం వల్ల 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
2021 సంవత్సరానికి గానూ రోడ్డు ప్రమాదాల వివరాలను ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా -2021’ (Road
accidents in India–2021) పేరుతో రూపొందించిన ఒక నివేదికలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆ సంవత్సరం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల మొత్తంగా 1997 రోడ్డు ప్రమాదాలు జరిగాయిని తెలిపింది. ఈ యాక్సిడెంట్స్‌లో మొత్తం 1040 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలో తేలింది.
ట్రాఫిక్ పోలీస్ కనిపించకపోతే, రెడ్ లైట్‌ను జంప్ చేయడం చాలా మంది వాహన దారులకు అలవాటు…రెడ్ లైట్ పడిన సమయంలో వాహనాన్ని నిలపకుండా, వేగంగా ముందుకు వెళ్లడం వల్ల 2021 సంవత్సరంలో మొత్తం 555 రోడ్డు ప్రమాదాలు జరగగా, 221 మంది ప్రాణాలను కోల్పోయారు. అలాగే, రోడ్లపై గుంతల వల్ల 2021లో అత్యధికంగా 3,625 ప్రమాదాలు జరిగాయి. 1481 మంది దుర్మరణం పాలయ్యారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, రోడ్డు ప్రమాద మరణాలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని నివేదిక చెబుతోంది.. వాహనదారుల నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల జరిగే ప్రమాదాలను వారిలో అవగాహన కల్పించడం ద్వారా, అలాగే జరిమానా వసూలు చేయడం, జైలుశిక్ష విధించడం వంటి కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా నివారించవచ్చని పేర్కొంది..రోడ్డును నిర్మించే సమయంలోనే ప్రమాదాల నివారణకు సంబంధించిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొంది. వాహనదారులకు ఏమాత్రం భయం లేదు.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడితే ఆగకుండా వెళ్లిపోవడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వైఖరీ ఎక్కువగా ఉంది. మీకు తెలుసోలేదో.. ఛత్తీస్‌ఘడ్‌ లాంటి రాష్ట్రాల్లో.. రాత్రి మూడు గంటల సమయంలో కూడా ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడితే వాహనాలు ఆగిపోతాయి.. నిజానికి అక్కడ ఎలాంటి డైవర్షన్‌ ఉండదు, ట్రాఫిక్‌ పోలీస్‌ ఉండడు…. కేవలం ఒక్క కారు మాత్రమే ఉంటుంది. అయినా సరే సిగ్నల్‌ పడితే ఆగుతుంది. అలాంటి స్ట్రిట్‌ రూల్స్‌ను మన దగ్గర ఎందుకు పాటించడం లేదో.. అది కూడా ఇండియాలోనే కదా ఉంది..!
కేంద్ర రహదారుల శాఖ నివేదిక ప్రకారం.. 2021లో మొత్తంగా 4, 12, 432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,84,448 మంది గాయాలపాలయ్యారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ శాఖ ల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Latest news