రక్త సంబంధీకులైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీల మధ్య అనుబంధం ఎక్కడా కనిపించదు. మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు బీజేపీలో ఉంటున్నారు. తాజాగా వరుణ్ గురించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందని… కానీ వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని చెప్పారు. వరుణ్ ను తాను కౌగిలించుకోగలనని, ప్రేమతో మాట్లాడగలనని చెప్పారు. కానీ వరుణ్ పుచ్చుకున్న రాజకీయ భావజాలాన్ని తాను స్వీకరించలేనని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వరుణ్ పాల్గొంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతాన్ని వరుణ్ గాంధీ ఎప్పుడో అంగీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. తాను ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఎప్పటికీ వెళ్లలేనని, అంతకు ముందు కావాలంటే తన తల తీసేయొచ్చని అన్నారు. తన కుటుంబానికి ఒక భావజాలం, ఆలోచనా విధానం ఉందన్నారు. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక పోరు సాగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలా ఉండగా అధికార బీజేపీకి సైద్ధాంతిక మూలమైన ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనిని వరుణ్ గాంధీ ప్రశంసించిన సంఘటనను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు.