ఏపీలో రాజకీయం, సినిమా ఏకమైపోయినట్లే కనిపిస్తోంది. సినీ నటులు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. వారు కూడా ఢీ అంటే ఢీ అనేలా పోరుకు తలపడుతున్నారు. ఇంతకాలం కలిసి పనిచేసిన వారు ఇప్పుడు విడిపోయి రాజకీయంగా తిట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో వైసీపీలో ఉన్న మంత్రి రోజా పవన్‌ని ఏ విధంగా టార్గెట్ చేసి తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అటు జనసేన వాళ్ళు సైతం రోజాని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా ఆలీ కూడా లైన్ లోకి వచ్చారు. పవన్‌కు ఆలీ ఎంత క్లోజ్ అనేది చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఆలీ వైసీపీలో చేరాక పరోక్షంగా పవన్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా పవన్‌పై పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. తమ సీఎం జగన్ ఆదేశిస్తే..పవన్‌పై పోటీకి రెడీ అని చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల రోజాని పవన్ డైమండ్ రాణి అంటూ కామెంట్ చేయడంపై కౌంటర్ వేశారు.
తాజాగా నగరిలోని రోజా ఇంటికొచ్చిన ఆలీ.. పవన్ కల్యాణ్ మిత్రుడైనా..కుటుంబం, స్నేహం, రాజకీయాలు వేర్వేరని, రాష్ట్రంలోని 175 సీట్లలో వైసీపీ గెలవడం ఖాయమని, డైమండ్ విలువైందని, లండన్‌లో నేటికీ కోహినూర్ వజ్రం అంటే మంచి పేరుందని, రోజాను డైమండ్ రాణి అని అనడమంటే ఆమె గొప్పతనాన్ని పొగిడినట్లే తప్ప విమర్శించినట్లు కాదని ఆలీ చెప్పుకొచ్చారు.
అయితే పవన్‌పై పోటీ చేస్తాననడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే ప్రజలని ఒక్క ఛాన్స్ అడిగి వైసీపీ గెలిచిందని, ఆ వేవ్ లో పవన్ ఓడిపోయారని, ఈ సారి ఎన్నికల్లో ఆ ఛాన్స్ ఉండదని, జనసేన సింగిల్ గా పోటీ చేసినా సరే పవన్ ఈ సారి గెలిచి తీరతారని జనసేన శ్రేణులు అంటున్నాయి. పైగా టీడీపీతో పొత్తు ఉంటే ఇంకా మెజారిటీ లెక్క పెట్టుకోవాలని దమ్ముంటే వైసీపీ ఆలీని బరిలో దింపవచ్చని..అప్పుడు ప్రజలే డిసైడ్ చేస్తారని అంటున్నారు. మొత్తానికైతే ఆలీ పోటీ చేసినా, ఇంకా ఎవరు వైసీపీ నుంచి పోటీ చేసినా ఈ సారి మాత్రం పవన్‌ని ఓడించడం అనేది కాస్త కష్టమనే తెలుస్తోంది.