రాజ్యాంగానికి, గవర్నర్కు సీఎం కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ తొందరగా వీఆర్ఎస్ తీసుకోని వెళ్లిపోతే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రికి మహిళలంటే చిన్నచూపన్న విజయశాంతి .. కేసీఆర్ పాలనలో మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పని అయిపోయిందని, ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని అన్నారు. బీజేపీలోకి చేరికలు మరింత పెరుగుతాయని విజయశాంతి చెప్పారు. ఇదిలా ఉంటే.. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణను కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని విజయశాంతి విమర్శించారు. పరేడ్‌తో సహా వేడుకలు నిర్వహించాల్సిందేనని హైకోర్టుతో చెప్పించుకోవలసి రావడం నిజంగా సిగ్గుచేటని విజయశాంతి మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
‘భారత రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్‌ని పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం… ఈ సారి కచ్చితంగా పరేడ్‌తో సహా వేడుకలు నిర్వహించాల్సిందేనని హైకోర్టుతో చెప్పించుకోవలసి రావడం నిజంగా సిగ్గుచేటు. గవర్నర్ తమిళిసై గారితో ఉద్దేశ్యపూర్వకంగా తగవులు పెట్టుకున్న కేసీఆర్ సర్కారు… గతేడాది నుంచీ రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణను నిర్లక్ష్యం చేసింది. గవర్నర్ గారికి ప్రసంగ పాఠం అందజేయడం, పోలీస్ పరేడ్, గౌరవ వందనం సమర్పించడం ద్వారా తమిళిసై గారికి ప్రాధాన్యం ఇవ్వడం ఇష్టంలేకే ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదని అందరికీ తెలుసు. తెలంగాణ సర్కారు ఈ చర్య ద్వారా ప్రభుత్వాధినేత అయిన గవర్నర్ గారిని అవమానించడమే గాక, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళామూర్తిని చులకనగా చూడటమే అవుతుంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను ఏదో గొప్పగా వజ్రోత్సవాలంటూ ప్రత్యేకంగా నిర్వహించిన సీఎం గారు… అంతే ప్రాధాన్యత గల రిపబ్లిక్ డేని నిర్లక్ష్యం చెయ్యడంలోని ఆంతర్యాన్ని ఆ మాత్రం గ్రహించలేని అమాయకులు కారు ప్రజలు. రాజ్యాంగాన్ని కించపరిచే చర్యలతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఈ తెలంగాణ సర్కారుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.’ అని విజయశాంతి అన్నారు.