ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివాళ్ళు ఉండరు..చదువుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా సోషల్ మీడియాను యూజ్ చేయకుండా ఉండలేరనేది కూడా పచ్చి నిజం.. జనాలను అలా తనవైపు తిప్పుకుంది సోషల్ మీడియా.. ప్రపంచం మారుమూలన సైతం ఏం జరిగినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే, ఈ సోషల్ మీడియా వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అట్టాంటిట్టాంటి దుష్ప్రభావాలు కాదు.. తేడా కొడితే జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుంది.
అవును, సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ఈ నియమాలు తెలియక ఏదైనా తప్పు చేస్తే నేరంగా పరిగణించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా అనుచిత కార్యకలాపాలు చేస్తే.. అది నేరం పరిధిలోకి రావచ్చు. అంతేకాదు.. ఇలా చేసినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. అందుకే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని తప్పక గుర్తించుకోవాలి.. అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన చట్టం చాలా కఠినంగా ఉంటుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు మీ కంట పడితే.. వాటిని అస్సలు చూడొద్దు. అంతేకాదు.. దానికి సంబంధించి ఎలాంటి సెర్చింగ్ చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం.. జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉంది..
సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా ఫేక్ న్యూస్ మీకు కనిపిస్తే.. దానిని షేర్ చేయకూడదు. తప్పుడు వార్తలను షేర్ చేస్తే మీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా వార్తలను షేర్ చేసే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి..
ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యంతకరమైన వీడియోలను షేర్ చేయకూడదు. అది నేరంగా పరిగణిస్తారు. అభ్యంతరకర వీడియోలను షేర్ చేయడం చట్టరిత్యా నేరం. ద్వేషం, వివక్ష, రెచ్చగొట్టే వీడియోలను అస్సలు షేర్ చేయొద్దు… వీటిని లైట్ తీసుకొని షేర్ చేస్తే ఊసలు లెక్కబెట్టాలని గుర్తుంచుకోండి..