ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇటీవల గన్నవరం టీడీపీ కార్యాయలంపై దాడి.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం అరెస్ట్ పెనుదుమారం రేపింది. అయితే ఈ నేపథ్యంలో.. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని లేఖలో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే విపక్ష నేతలు, ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై, పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేయడం వైసీపీ విధ్వంసానికి తాజా ఉదాహరణ అని చెప్పారు. బాధితులనే నిందితులుగా మార్చి, పోలీస్ టార్చర్ కు గురిచేసి, జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు.
“జగన్ అరాచక పాలనతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు… బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారింది. పన్నులపై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు, ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారిందన్నారు చంద్రబాబు