నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థినిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై పూలదండతో వచ్చారని ఆమె సోదరి దీప్తి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు సరైన వైద్యం అందడం లేదని వాపోయారు. దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ పరామర్శించడానికి రావొద్దని కోరారు.
గవర్నర్ పూలదండతో ఆస్పత్రికి వెళ్లారని వస్తోన్న ఆరోపణలపై రాజ్ భవన్ స్పందించింది. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూల దండ ఉంచామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది.
‘‘గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీత అర్థాలు తీయడం సహేతుకం కాదు. అలాగే ప్రీతి త్వరగా కోలుకోవాలని హనుమంతుడి గుడిలో గవర్నర్ ప్రార్థించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలి’’ అని ప్రకటనలో పేర్కొంది.