సీబీఐ తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 నూతన మద్యం పాలసీ కొత్త విధానంలో అనేక అక్రమాలు జరిగాయని గతేడాది జులైలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అప్పట్లో రిపోర్టు ఇచ్చారు. కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేసినట్లుగా ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోదియా పేరునూ ఇందులో ప్రధానంగా చేర్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేయడంతో ఇది పెద్ద సంచలనంగా మారింది.
దీంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ లిక్కర్ స్కాం కేసులో పలువురు నేతలతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. చివరకు ఈ ఎక్సైజ్ నూతన పాలసీ విధానాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను సీబీఐ అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని అభ్యంతరం తెలిపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని మనీశ్ సిసోడియాకు సుప్రీం ధర్మాసనం సూచించింది. అయినా, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నాడు. మార్చి 4తో ఆయన కస్టడీ ముగియనుంది.