దేశంలో కొత్త వైరస్ హెచ్3ఎన్2 వైరస్ విజృభిస్తుంది. ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నమోదైంది. ఈ వైరస్ బారినపడిన 58 యేళ్ళ ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే, ఈమె అప్పటికే అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ వచ్చినట్టు సమాచారం.
అలాగే, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కరు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. హెచ్3ఎన్2 వైరస్ అనేది ఏ ఉప రకం. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు కూడా కరోనాను పోలి ఉన్నట్టు గుర్తించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు ఐసీఎంఆర్, ఐఎంఏ వెల్లడించాయి. కాగా, జనవరి 2 నుంచి భారత్ లో హెచ్3ఎన్2 కేసులు నమోదు చేస్తున్నారు. మార్చి 5 నాటికి దేశవ్యాప్తంగా 451 కేసులు గుర్తించారు. ఈ వైరస్ సోకినవారికి జలుబు, శరీర నొప్పులు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే, ఈ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుందని వైద్యులు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఈ వైరస్ బారినపడి ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.