దిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ ఎదుట రెండోసారి హాజరయ్యారు. దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత.. విచారణకు హాజరయ్యారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్, న్యాయవాది భరత్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ను విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనం… మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు మొగ్గుచూపలేదు. అదే విధంగా ఈనెల 24న వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండటంతో ఈనెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. సుప్రీంకోర్టు తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇవాళ కవిత విచారణకు హాజరయ్యారు.