ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు దిమ్మతిరిగిపోయింది. ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధకు వారు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో ఆమెకు 23 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా ఆమె ఘన విజయం సాధించారు. టీడీపీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు వైకాపా పంచన చేశారు. మిగిలిన 19 ఎమ్మెల్యేల బలంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరపున అనురాధను అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు టీడీపీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో పాటు నెల్లూరు జిల్లాకు వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు వైకాపాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనురాధకు క్రాస్ ఓటింగ్ వేశారు. ఫలితంగా ఆమె అనూహ్యంగా గెలుపొందారు.
అయితే, టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మరోవైపు అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ విజయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబసభ్యురాలు పంచుమర్తి అనూరాధ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారు. ‘మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశావు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నావు. చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో నీ ఓటమి – మా గెలుపు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు’ అని దెప్పిపొడిచారు.